T20 World Cup: రోహిత్‌కు కూడా తెలుసు... అందుకే ఇషాన్‌ను పంపాం: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌

2 Nov, 2021 16:35 IST|Sakshi

Vikram Rathour explains why Ishan Kishan opened against New Zealand: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో సెమీ ఫైనల్‌ చేరాలంటే కీలకంగా మారిన అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో పలు కీలక మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకు బదులు ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించారు. గాయపడిన సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను ప్రమోట్‌ చేసింది. కానీ... ఆ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌(4) పూర్తిగా విఫలమయ్యాడు. 

అతనొక్కడే కాదు... మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(18), వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్‌ శర్మ(14) , కెప్టెన్‌ కోహ్లి(9) చేతులెత్తేయడంతో తక్కువ స్కోరుకే పరిమితమైన కోహ్లి సేన కివీస్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. దీంతో సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం కాగా.. టీమిండియా ఆట తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి.  ముఖ్యంగా తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ వంటి యువ ఆటగాడిని ఓపెనర్‌గా పంపడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘ఆ ముందురోజు రాత్రి సూర్య వెన్ను నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్‌ ఆడేందుకు తను సిద్ధంగా లేడు. అలాంటి సమయంలో సూర్య స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ అని భావించాం. ఐపీఎల్‌లోనూ.. గతంలో జాతీయ జట్టు తరఫున తను ఓపెనింగ్‌ చేశాడు. 

దీంతో మేనేజ్‌మెంట్‌ అంతా ఓ చోట కూర్చుని చర్చోచర్చలు జరిపాం. అంతేకాదు రోహిత్‌ శర్మ కూడా అందులో ఒకడు. ఆ చర్చలో తనూ పాల్గొన్నాడు. లెఫ్ట్‌ హ్యాండర్‌ను ప్రమోట్‌ చేయాలనుకున్నాం. మిడిలార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌, పంత్‌, జడేజా.. ఇలా అంతా ఎడమ చేతి వాటం గల బ్యాటర్లే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇషాన్‌ను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించాం’’ అని విక్రమ్‌ చెప్పారు.

ఇక టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా భవిష్యత్తు ఎలా ఉండబోతున్న ప్రశ్నకు బదులుగా... ‘‘టీమిండియాలోని అత్త్యుత్తమ, నైపుణ్యం గల ఆటగాళ్లతో కలిసి పనిచేసిన అనుభవం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పటికే నేను బ్యాటింగ్‌ కోచ్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. మేనేజ్‌మెంట్‌ ఏ నిర్ణయం తీసుకున్నా నేను సన్నద్ధంగా ఉంటాను’’ అని విక్రమ్‌ చెప్పుకొచ్చారు.

టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌- స్కోర్లు: 
ఇండియా- 110/7 (20)
న్యూజిలాండ్‌- 111/2 (14.3)

చదవండి: Virat Kohli On India Loss: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం..

Poll
Loading...
మరిన్ని వార్తలు