T20 World Cup: మార్టిన్‌ క్రో ఆత్మ శాంతించేదెప్పుడు?

15 Nov, 2021 11:57 IST|Sakshi

Martin Crowe Dream Of ICC Trophy: న్యూజిలాండ్‌ దిగ్గజ క్రికెటర్‌ మార్టిన్‌ క్రో..  2015 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సందర్భంగా అందరీ చేత కన్నీళ్లు పెట్టించాడు. ‘మరో మ్యాచ్ చూసేందుకు నా జీవితం ఇక అనుమతించకపోవచ్చు. కానీ బతికేందుకు ఈ జ్ఞాపకాలు చాలు. రోజంతా కన్నీళ్లను మాత్రం బయటకు కనిపించనీయను’ అని అన్న మాటలు క్రికెట్‌ ప్రేమికులు ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. ఆ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లు తలపడ్డాయి.  ఆ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు మార్టిన్‌ క్రో. తన సారథ్యంలో తమ జట్టు సాధించలేని వరల్డ్‌కప్‌ను కివీస్‌ కైవసం చేసుకుంటుందని మార్టిన్‌ ఎంతగానో ఆశించాడు. కానీ మార్టిన్‌ క్రోకు నిరాశే ఎదురైంది. ఆ పోరులో న్యూజిలాండ్‌ ఘోర వైఫల్యంతో తొలిసారి వరల్డ్‌కప్‌ సాధించాలన్న కల తీరలేదు.

ఆ తర్వాత ఏడాదికి మార్టిన్‌ క్రో కన్నుమూయగా, ఆపై న్యూజిలాండ్‌ రెండుసార్లు వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరింది. ఒకటి వన్డే వరల్డ్‌కప్‌లో(2019) అయితే, మరొకటి టీ20 వరల్డ్‌కప్‌(2021)లో కివీస్‌ తుదిపోరుకు అర్హత సాధించింది.  2019 వన్డే వరల్డ్‌కప్‌లో సూపర్‌ ఓవర్‌ రూపంలో కివీస్‌ను దురదృష్టం వెంటాడంతో రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఆ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన పరిస్థితులు అప్పట్లో వివాదంగా మారాయి. కానీ ఐసీసీ నిబంధనలు అప్పటికి అలానే ఉండటంతో కివీస్‌ చేసేది ఏమీ లేకపోయింది. క్రికెట్‌ ప్రేమికులు మాత్రం పాపం.. న్యూజిలాండ్‌ అనుకోవాల్సి వచ్చింది. మరి ఆ దేశం క్రికెట్‌ వరల్డ్‌కప్‌ కోసం ఎంతో ఎదురుచూసిన మార్టిన్‌ క్రో..అప్పటికి కన్నుమూసి నాలుగేళ్ల అయ్యింది. ఒకవేళ కివీస్‌ వరల్డ్‌కప్‌ గెలిస్తే ‘మనం వరల్డ్‌కప్‌ గెలిచాం.. ఒకసారి మేల్కొని మా చేతిలో ఉన్న ట్రోఫీని చూడు మార్టిన్‌ బ్రో’ అని కివీస్‌ ప్లేయర్లు గట్టిగా అరిచే చెప్పేవాళ్లు.  
చదవండి: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్‌.. మనసులు గెలిచారు!

ఎందుకంటే ఏదొక రోజు తాము వరల్డ్‌కప్‌ గెలిచి మార్టిన్‌ను మేల్కొపు తామని మార్టిన్‌ మరణానంతరం ఒక కివీస్‌ క్రికెటర్‌ వ్యక్తం చేసిన ఆవేదన ఇది.  ప్రస్తుతం స్వర్గంలో చిన్న నిద్ర తీసుకుంటున్న మార్టిన్‌.. తాము వరల్డ్‌కప్‌ గెలిస్తే కచ్చితంగా మేల్కొంటాడని చెప్పుకొచ్చాడు. తను జీవించినంత కాలం క్రికెటే శ్వాసగా బ్రతికిన మార్టిన్‌.. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీకు చేరిన న్యూజిలాండ్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.  ఆ మెగా టోర్నీలో అంచనాలు లేకుండా దిగిన కివీస్‌.. లీగ్‌ దశలో అజేయంగా నిలిచి సెమీస్‌కు చేరింది. కానీ సెమీస్‌లో పాక్‌ రూపంలో కివీస్‌ను దురదృష్టం వెంటాడింది. కానీ మార్టిన్‌ మాత్రం 456 పరుగులతో ఆ టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ద వరల్డ్‌కప్‌ గెలిచాడు. ఆ వరల్డ్‌కప్‌ను ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాక్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

కివీస్‌కు కొత్త కళ తెచ్చిన క్రికెటర్‌
సుమారు పదుమూడేళ్ల పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రో వరుస గాయాలతో 33 ఏళ్లకే 1995లో రిటైర్మెంట్ ప్రకటించారు. 80ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీగా పరుగులు సాధించిన క్రో, నాడు న్యూజిలాండ్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు.  న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు చాలా ఏళ్లు క్రో పేరిటే ఉండగా, అత్యధిక సెంచరీల రికార్డు(17) కూడా సుదీర్ఘ కాలం అతని పేరిటే కొనసాగింది. మార్టిన్ క్రో అనగానే ఈతరం అభిమానులకు కూడా గుర్తొచ్చేది 1992 ప్రపంచకప్. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా పించ్ హిట్టర్, స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడంలాంటి అపూర్వ వ్యూహాలతో టోర్నీకి ఆయన కొత్త కళ తెచ్చారు.
 (చదవండి :ఆసీస్‌కు అందిన ద్రాక్ష)

కివీస్‌ను ఎంతో ఉన్నత శిఖరాల్లో నిలబెట్టిన మార్టిన్‌ క్రో కల ఇంకా అలానే ఉండిపోయింది. ఆ దేశం వరల్డ్‌కప్‌ సాధించాలనే ఆయన కలకు ఇప్పటికీ ముగింపు లభించలేదు. ఆసీస్‌ చేతిలో ఓటమి పాలు కావడంతో అయ్యో కివీస్‌ ఇంకెప్పుడు వరల్డ్‌కప్‌ సాధిస్తారని అనుకోవడం అభిమానుల వంతైంది. అటు వన్డే వరల్డ్‌కప్‌, ఇటు టీ20 వరల్డ్‌కప్‌ను ఇప్పటికీ సాధించకపోవడమే సగటు క్రికెట్‌ అభిమానికి ఇంకా నిరాశగానే ఉంది. భారత్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌(2సార్లు), శ్రీలంక, ఆస్ట్రేలియాలు టీ20 వరల్డ్‌కప్‌లు సాధించినా ఈ బ్లాక్‌ క్యాప్స్‌ మాత్రం.. ఇంకా బ్లాక్‌ హార్స్‌గా ఉండటం క్రికెట్‌ అభిమానులకు మింగుడు పడని అంశం.

మరిన్ని వార్తలు