సీఎస్‌కే జెర్సీ తీశాడు.. టీమిండియా జెర్సీ వేశాడు!

23 Oct, 2021 16:25 IST|Sakshi
ఫోటో కర్టసీ(బీసీసీఐ ట్వీటర్‌)

హెలికాప్టర్‌ షాట్లతో దరువు.. కీపింగ్‌లో చురుకు, వ్యూహాల్లో పదును.. మాటల్లో కుదరు, మిస్టర్‌ కూల్‌గా నిక్‌నేమ్‌.. యువ క్రికెటర్లకు ఇన్‌స్పిరేషన్‌, రెండు వరల్డ్‌కప్‌లు(టీ20 వరల్డ్‌కప్‌, వన్డే వరల్డ్‌కప్‌)గెలిపించిన నాయకత్వం.. నాలుగు ఐపీఎల్‌ టైటిల్స్‌ సాధించిన సారథ్యం, వివాదాలకు దూరం.. విజయాలతో సావాసం.. ఇవన్నీ కలిస్తేనే ఎంఎస్‌ ధోని.

నాయకుడిగా టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ధోని.. ఇప్పుడు మెంటార్‌గా సేవలందిస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ధోని తన పనికి పదును పెడుతున్నాడు. ఒక కెప్టెన్‌గా ఎంతో సక్సెస్‌ చవిచూసిన మిస్టర్‌ కూల్‌.. మెంటార్‌గా రాణించాలనే తపనతో ఉన్నాడు. తనపై పెట్టిన బాధ్యతను ఎటువంటి లోపాలు లేకుండా నిర్వర్తించే ధోని.. మరో కొత్త పాత్రలో మెరవడానికి సిద్ధమైపోయాడు. 

ఆదివారం(అక్టోబర్‌ 24వ తేదీ) టీమిండియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న తరుణంలో ధోని వ్యూహ రచన ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశమైంది. ఒక జట్టులో మెంటార్‌ పాత్ర పరిమితంగానే ఉంటుందనేది వాస్తవమే అయినప్పటికీ, అక్కడ ఉన్నది ధోని కాబట్టి అతనికి ప్రాధాన్యత ఉంటుందనేది కూడా అంతే వాస్తవం. ఇలా ఐపీఎల్‌ ముగిసిందో లేదో వెంటనే వరల్డ్‌కప్‌ ప్రారంభమైంది. ధోనిని టీమిండియా మెంటార్‌గా నియమించాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నిర్ణయం కూడా అంతే వేగంగా జరిగిపోయింది. అంతే సీఎస్‌కే జెర్సీని ఇలా తీశాడో లేదో ఇలా టీమిండియా జెర్సీ వేశాడు మిస్టర్‌ కూల్‌. కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అన్నట్లు టీమిండియాతో కలిసిపోయాడు ధోని.

ఏకైక నాయకుడు ధోని.. 
భారత మాజీ కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని ఒక సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా నిలిచిన ధోని.. టీ20 వరల్డ్‌కప్‌ వంటి మెగా ఈవెంట్లలో  కూడా  పలు రికార్డులను సాధించాడు. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను సాధించడమే కాకుండా,  ఓవరాల్‌గా ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో అత్యధిక డిస్మిసల్స్‌ చేసిన రికార్డును కూడా నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోని 32 డిస్మిసల్స్‌ సాధించి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక 2007 నుంచి 2017 వరకూ టీమిండియాకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని..  ఇప్పటివరకూ జరిగిన ప్రతీ టీ20 వరల్డ్‌కప్‌లోనూ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫలితంగా టీ20 వరల్డ్‌కప్‌ ఆడినంత కాలంగా ఒక జట్టుకు కెప్టెన్‌గానే కొనసాగిన ఏకైక ప్లేయర్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ధోని. 

మళ్లీ బ్లూ జెర్సీలో ధోని 
ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కేకు టైటిల్‌ అందించడం ద్వారా ధోని తనలోని కెప్టెన్సీ పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే దారుణంగా విఫలమైనప్పటికీ, ఈ ఏడాది ఏ జట్టుకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముందునుంచి ముందుండి నడిపించాడు ధోని. ప్రాక్టీస్‌ ముందుగానే మొదలు పెట్టి ఆటపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఏ పనినినైనా ఇష్టంగా చేయాలని అంటారు. ధోని నమ్ముకుంది క్రికెట్‌ను, అందుకే విలక్షణమైన నాయకుడిగా ఎదిగాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లోనే కప్‌ను గెలిచిన ధోని.. ఆపై వెనుదిరిగి చూసిందే లేదు.  మళ్లీ మెన్‌ ఇన్‌ బ్లూతో కలిసి పనిచేస్తున్న ధోని.. ఈ వరల్డ్‌కప్‌లో తన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తాడో చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు