T20 World Cup 2022: ఈసారీ ఫ్లాప్‌ షో

11 Nov, 2022 04:47 IST|Sakshi

సెమీఫైనల్లోనే ఓడిన భారత్‌

మళ్లీ ప్రపంచకప్‌లో భంగపాటు

10 వికెట్లతో ఇంగ్లండ్‌ ఘన విజయం

హేల్స్, బట్లర్‌ మెరుపులు

ఫైనల్లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్‌ ‘ఢీ’

ఏడాది వ్యవధిలో మరోసారి భారత క్రికెట్‌ అభిమానులను మన జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. గత టి20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశకే పరిమితమైన జట్టు ఆ నిరాశను దూరం చేస్తూ ఈసారి అత్యధిక విజయాలతో సెమీస్‌ చేరడంతో కొత్తగా ఆశలు చిగురించాయి. అయితే ఇంగ్లండ్‌ అద్భుత బ్యాటింగ్‌తో వాటిని తుంచేసింది. ఇప్పటి వరకు మన ఆటగాళ్ల ప్రదర్శన, ప్రత్యర్థిపై ఇటీవలి రికార్డు చూస్తే సెమీస్‌లోనూ విజయం సులువనిపించింది. కానీ బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించలేక సగం ఆట ముగిసే      సరికే వెనకడుగు వేసిన టీమిండియా...
బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ప్రత్యర్థి ఓపెనర్లు చెలరేగుతుంటే ఏం చేయాలో కెప్టెన్‌ సహా ఆటగాళ్లు బిక్కమొహం వేశారు!      టాస్‌ ఓడిపోవటం మొదలు ఏదీ భారత్‌కు అనుకూలంగా సాగలేదు. ఓపెనర్ల వైఫల్యం ఇక్కడా కొనసాగగా, మరోసారి ఆదుకోవాల్సిన భారం కోహ్లిపై పడింది. పరిస్థితిని బట్టి అతను కూడా కాస్త తగ్గి ఆడాల్సి రాగా, 360 డిగ్రీ సూర్యకుమార్‌ను సరైన వ్యూహంతో ఇంగ్లండ్‌ కట్టిపడేసింది. అంతా చేయిదాటిపోతున్న దశలో హార్దిక్‌ చెలరేగడంతో కీలక పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఛేదన ఇంత సులువా అనిపించేలా హేల్స్, బట్లర్‌ ఎవరినీ లెక్క చేయకుండా మన బౌలర్లందరిపై విరుచుకుపడ్డారు. ఫలితమే టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అతి పెద్ద భాగస్వామ్యం... ఆపై టీమిండియా ఓటమి ఖాయం. టోర్నీ తొలి విజేత తర్వాతి ఏడు ప్రయత్నాల్లోనూ రిక్తహస్తాలతో ఇంటికి..! 
 

అడిలైడ్‌: టి20 ప్రపంచకప్‌లో భారత్‌ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. సెమీస్‌లో సత్తా చాటి ఎంసీజీలో మరోసారి పాకిస్తాన్‌ను ఢీకొడుతుందని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్న ఫైనల్‌ సాధ్యమవుతుందని భావించిన వారందరికీ ఇంగ్లండ్‌ బలమైన షాక్‌ ఇచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి     ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, విరాట్‌ కోహ్లి (40 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మరో అర్ధసెంచరీ సాధించాడు. జోర్డాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్‌ 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 170 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలెక్స్‌ హేల్స్‌ (47 బంతుల్లో 86 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (49 బంతుల్లో 80 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్‌ తలపడుతుంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో మెల్‌బోర్న్‌ మైదానంలోనే ఇంగ్లండ్, పాకిస్తాన్‌ ఫైనల్లో తలపడగా పాక్‌ గెలిచింది.

సూర్యకుమార్‌ విఫలం...
ఈ నాకౌట్‌ మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో భారత్‌ స్కోరు 62/2 మాత్రమే! ఈ అతి జాగ్రత్తే చివరకు జట్టు కొంప ముంచింది. చివర్లో హార్దిక్‌ జోరుతో కొన్ని పరుగులు వేగంగా వచ్చినా, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తగినంత స్కోరు చేయలేక టీమిండియా భంగపడింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (5) మరో కీలక పోరులోనూ పేలవ ప్రదర్శన కనబర్చగా, రోహిత్‌ శర్మ (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యాడు.

రోహిత్‌ వెనుదిరిగిన తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ (10 బంతుల్లో 14) వరుస బంతుల్లో 6, 4 కొట్టి తన శైలిని ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాతి బంతికే రషీద్‌ అతని ఆటను ముగించడంతో భారత్‌కు ఎదురు దెబ్బ తగి లింది. ఫలితంగా కోహ్లి కూడా ఆత్మరక్షణలో పడి ధాటిని ప్రదర్శించలేకపోయాడు. 16 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 110 పరుగులకు చేరింది.  

4 ఓవర్లలో 58 పరుగులు...
భారత జట్టు చివరకు కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగిందంటే హార్దిక్‌ బ్యాటింగే కారణం. చివరి 4 ఓవర్లలో భారత్‌ 58 పరుగులు సాధిస్తే అందులో హార్దిక్‌ ఒక్కడే 50 కొట్టాడు! 18 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగాడు. జోర్డాన్‌ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన అతను, స్యామ్‌ కరన్‌ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదాడు. మరో ఎండ్‌లో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కోహ్లి వెనుదిరగ్గా, పంత్‌ (6) రనౌటయ్యాడు. జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో కూడా వరుసగా 6, 4 కొట్టాక వెనక్కి జరిగి మరో భారీ షాట్‌ ఆడే క్రమంలో ఆఖరి బంతికి హార్దిక్‌ అవుటయ్యాడు. బంతి బౌండరీని దాటినా, షాట్‌ ఆడే సమయంలో అతని కాలు స్టంప్స్‌ను తాకింది.  

ఎదురులేని బ్యాటింగ్‌...
ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించే వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ చివరి వరకు దానిని కొనసాగించింది. భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఓపెనింగ్‌ జోడీనే విడదీయలేకపోయారు. ఈ మ్యాచ్‌కు ముందు భువనేశ్వర్‌ బౌలింగ్‌లో చెత్త రికార్డు (32 బంతుల్లో 5 సార్లు అవుట్‌) ఉన్న బట్లర్‌ ఈసారి మాత్రం వెనక్కి తగ్గలేదు. భువీ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు బాది అతను తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. షమీ ఓవర్లో హేల్స్‌ 6, 4 కొట్టడంతో పవర్‌ప్లేలో ఇంగ్లండ్‌ 63 పరుగులు (9 ఫోర్లు, 1 సిక్స్‌తో) సాధించింది.

ఆ తర్వాత మరింత జోరుగా లక్ష్యం దిశగా జట్టు దూసుకుపోయింది.  28 బంతుల్లోనే హేల్స్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి కాగా, 61 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. అశ్విన్‌ ఓవర్లో హేల్స్‌ 6, 4 కొట్టగా, హార్దిక్‌ ఓవర్లో 6, 4 బాది బట్లర్‌ 36 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత షమీ ఓవర్లో బట్లర్‌ 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టడంతో ఇంగ్లండ్‌ విజయానికి చేరువైంది. షమీ తర్వాతి ఓవర్‌ ఆఖరి బంతికి లాంగాన్‌ మీదుగా భారీ సిక్సర్‌తో హేల్స్‌ ఆట ముగించాడు.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 5; రోహిత్‌ (సి) కరన్‌ (బి) జోర్డాన్‌ 27; కోహ్లి (సి) రషీద్‌ (బి) జోర్డాన్‌ 50; సూర్యకుమార్‌ (సి) సాల్ట్‌ (బి) రషీద్‌ 14; హార్దిక్‌ (హిట్‌వికెట్‌) (బి) జోర్డాన్‌ 63; పంత్‌ (రనౌట్‌) 6; అశ్విన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168.
వికెట్ల పతనం: 1–9, 2–56, 3–75, 4–136, 5–158, 6–168.
బౌలింగ్‌: స్టోక్స్‌ 2–0–18–0, వోక్స్‌ 3–0–24–1, స్యామ్‌ కరన్‌ 4–0–42–0, రషీద్‌ 4–0–20–1, లివింగ్‌స్టోన్‌ 3–0–21–0, జోర్డాన్‌ 4–0–43–3.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (నాటౌట్‌) 80; హేల్స్‌ (నాటౌట్‌) 86; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 170.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2–0–25–0, అర్‌‡్షదీప్‌ 2–0–15–0, అక్షర్‌ 4–0–30–0, షమీ 3–0–39–0, అశ్విన్‌ 2–0–27–0, హార్దిక్‌ 3–0–34–0.  

ఈ రోజు మా ఆటతో చాలా నిరాశ చెందాను. మేం బ్యాటింగ్‌ బాగానే చేశామని భావిస్తున్నా. బౌలింగ్‌ వైఫల్యంతోనే ఓడిపోయాం. 16 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా లక్ష్యం ఛేదించేంత సులువైన పిచ్‌ ఏమీ కాదిది. నాకౌట్‌ మ్యాచ్‌లలో ఒత్తిడిని జయించడం ముఖ్యం. ఇది ఎలా చేయాలో ఎవరూ నేర్పించరు. అది వ్యక్తిగతంగా చేయాల్సిన పని. ఐపీఎల్‌లో ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లలో వారంతా ఒత్తిడిని అధిగమించినవారే. మా బౌలింగ్‌కు సరైన ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లో బంతి కొంత స్వింగ్‌ అయినా అది సరైన దిశలో వెళ్లలేదు. మైదానం కొలతలపై మాకు అవగాహన ఉంది. వికెట్‌కు ఇరువైపులా పరుగులు ఆపేందుకు వ్యూహాలు రూపొందించినా ఇంగ్లండ్‌ ఓపెనర్లు భారీగా పరుగులు రాబట్టగలిగారు.
–రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌  

170: టి20 వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం.
1: టి20 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో ఒక జట్టు
10: వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొదటిసారి.
2:టి20 ప్రపంచకప్‌లో (2021లో పాక్‌ చేతిలో) రెండుసార్లు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఏకైక జట్టు భారత్‌.
4008: అంతర్జాతీయ టి20ల్లో కోహ్లి పరుగులు. 4 వేల పరుగులు దాటిన తొలి ఆటగాడిగా కోహ్లి.

మరిన్ని వార్తలు