ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్‌ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్‌ ‘బెంగ’!

29 Oct, 2022 11:43 IST|Sakshi
PC: ICC

T20 World Cup 2022- Final AT MCG: ఆస్ట్రేలియాలో కురుస్తున్న అకాల వర్షాలు యావత్‌ క్రికెట్‌ ప్రియుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. క్రేజీ టి20 ప్రపంచకప్‌కు పదే పదే వరుణుడు అడ్డుతగలడం... అనామక మ్యాచ్‌లతో పాటు రక్తి కట్టించే మ్యాచ్‌లు కూడా రద్దవడం అభిమానులకు ఆనందం దూరం చేస్తోంది. ఇప్పటివరకు మెగా ఈవెంట్‌లో 13 మ్యాచ్‌లు జరిగితే ఏకంగా ఐదు మ్యాచ్‌లపై వర్షం ప్రభావం చూపింది. ఇందులో 4 మ్యాచ్‌లైతే పూర్తిగా రద్దయ్యాయి.

కీలక మ్యాచ్‌ రద్దు!
ఒక మ్యాచ్‌కు అంతరాయం ఎదురైనా ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ ఫలితంతో బయటపడింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియాకు, డక్‌వర్త్‌తో క్రికెట్‌ కూన ఐర్లాండ్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌కు గ్రూప్‌–1లో శుక్రవారం కీలకమైన మ్యాచ్‌ జరగాల్సింది. దెబ్బతిన్న చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయమని క్రికెట్‌ విశ్లేషకులంతా భావించారు.

ఈ గ్రూప్‌ను శాసించే మ్యాచ్‌ అవుతుందనుకుంటే... వర్షంలో నిండా మునిగిపోయింది. ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించిన ఐర్లాండ్‌తో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌ కూడా రద్దవడం ఇరు జట్లను తీవ్రంగా నిరాశపరిచింది. గ్రూప్‌–1లో అఫ్గాన్‌ అంతటి బాధ ఇంకెవరికీ లేదు. జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం ఖాతాలో పడిపోయాయి.

శ్రీలంక మాత్రమే
ఈ గ్రూపులోని ఆరు జట్లలో ఒక్క శ్రీలంక మాత్రమే వాన బాధితుల జాబితాలో లేదు. కివీస్, ఇంగ్లండ్, ఆసీస్, ఐర్లాండ్, అఫ్గాన్‌లను వాన ఇబ్బంది పెట్టింది. పాయింట్ల పట్టికలో ఈ ఐదు జట్లు ‘ఫలితం తేలని’ రికార్డులో నిలిచాయి. 

భారతీయులు అత్యధికంగా ఉండే సిడ్నీని కాదని
ఆస్ట్రేలియాలోనే సుప్రసిద్ధ వేదిక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ). కానీ ఇప్పుడిదే ఈ ప్రపంచకప్‌కు కంటగింపుగా మారింది. 90 వేల పైచిలుకు సామర్థ్యమున్న ఈ ప్రధాన స్టేడియంలో పొట్టి మెరుపులు చూద్దామని పట్టుబట్టి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు తీరా మైదానానికి వచ్చే సరికి చినుకులు ఎదురవుతున్నాయి.

క్రికెట్‌ను ఆస్వాదించాలన్న ఆశలపై వరుణుడు అదే పనిగా నీళ్లుజల్లుతున్నాడు. పూర్తిగా రద్దయిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇక్కడ జరగాల్సినవే కాగా ఒకటి హోబర్ట్‌లో రద్దయింది. భారతీయులు అత్యధికంగా ఉండే సిడ్నీని కాదని దాయాదుల సమరానికి క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎంచుకున్న మైదానం ఎంసీజీ.

సుప్రసిద్ధ వేదిక.. 667లో ఒక్కటే రద్దు.. అయినా ఫైనల్‌ బెంగ!
అయితే మ్యాచ్‌కు ముందు వర్షభయమున్నప్పటికీ ఇండో–పాక్‌ సమరం జరగడం... ఫైనల్‌ను మించిన వినోదం అందించడం సీఏకు అత్యంత ఊరటనిచ్చే అంశం. అయితే ఇంగ్లండ్‌తో తమ జట్టుకు శుక్రవారం ఏర్పాటు చేసిన మ్యాచ్‌ కూడా వర్షం ఖాతాలో పడటమే సీఏను ఇబ్బంది పెడుతోంది.

అన్నట్లు ఫైనల్‌కు కూడా ఎంసీజీనే వేదిక. రిజర్వ్‌ డే ఉన్నప్పటికీ సూపర్‌–12 దశలో వరుసగా 26, 28 తేదీల్లో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల్ని తుడిచిపెట్టేయడం క్రికెట్‌ వర్గాల్లో ‘ఫైనల్‌’ బెంగను పెంచుతోంది. ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ మూడు మ్యాచ్‌లకు ముందు ఎంసీజీలో 667 టి20 మ్యాచ్‌లు జరగ్గా... ఒకే ఒక్క మ్యాచ్, అదీ 2007లో మాత్రమే రద్దయింది.    

చదవండి: T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి'
T20 WC 2022: 'రోహిత్‌, కోహ్లి కాదు.. అతడే టీమిండియా బెస్ట్‌ బ్యాటర్‌'

మరిన్ని వార్తలు