‘ఫిలిప్స్‌’ పవర్‌

30 Oct, 2022 05:55 IST|Sakshi

కివీస్‌ బ్యాటర్‌ మెరుపు సెంచరీ

65 పరుగులతో శ్రీలంక ఓటమి  

సిడ్నీ: శ్రీలంక అద్భుత బౌలింగ్‌తో 4 ఓవర్లలో 15 పరుగులకే 3 న్యూజిలాండ్‌ వికెట్లను పడగొట్టింది. ఏడో ఓవర్లో నిసాంక ఒక సునాయాస క్యాచ్‌ పట్టి ఉంటే కివీస్‌ స్కోరు 29/4 అయ్యేది! కానీ ఆ వదిలేసిన క్యాచ్‌కు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 12 పరుగుల వద్ద అదృష్టం కలిసొచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. 45 పరుగుల వద్ద అతనిదే మరో క్యాచ్‌ షనక వదిలేయడంతో అతను సెంచరీ వరకు దూసుకుపోయాడు. ఈ ప్రదర్శన కారణంగానే చివరకు గ్రూప్‌–1 కీలక పోరులో న్యూజిలాండ్‌ చేతిలో 65 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తయింది. తాజా ఫలితంతో కివీస్‌ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచే అవకాశాలు మరింత మెరుగవగా, లంక సెమీస్‌ చేరడం చాలా కష్టంగా మారింది.

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అలెన్‌ (1), కాన్వే (1), విలియమ్సన్‌ (8) విఫలమయ్యారు. ఈ దశలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ ఫిలిప్స్‌ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) లంక బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన అతనికి శతకం చేరేందుకు మరో 22 బంతులు సరిపోయాయి. మిచెల్‌ (22)తో కలిసి నాలుగో వికెట్‌కు ఫిలిప్స్‌ 64 బంతుల్లోనే 84 పరుగులు జోడించాడు. ఫిలిప్స్‌కు టి20ల్లో ఇది రెండో సెంచరీ. అనంతరం శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. 10 ఓవర్లు ముగిసేసరికి 58 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంక ఆ తర్వాత చేయడానికేమీ లేకపోయింది. రాజపక్స (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు),  షనక (32 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కొద్దిగా పోరాడగలిగారు. ట్రెంట్‌ బౌల్ట్‌ (4/13) తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలతో లంకను దెబ్బ తీయగా... ఇష్‌ సోధి (2/21), సాన్‌ట్నెర్‌ (2/21) కూడా రాణించారు. 

మరిన్ని వార్తలు