T20 World Cup 2022: వరుస ఓటములు.. అయినా పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు చేరే ఛాన్స్‌?

28 Oct, 2022 07:50 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో పాకిస్తాన్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. సూపర్‌-12లో భాగంగా పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది.

దీంతో పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ ఐదో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే టెక్నికల్‌గా మాత్రం పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు.

పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు చేరాలంటే
గ్రూపు-2 నుంచి పాకిస్తాన్‌ సెమీస్‌లో అడుగు పెట్టాలంటే తమ తదుపరి మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాలి. పాకిస్తాన్‌ వరుసగా నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో పాక్‌ విజయం సాధిస్తే వారి ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి.

ఈ క్రమంలో పాకిస్తాన్‌ సెమీస్‌ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. అప్పడు రన్‌రేట్‌ కీలకం కానుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌ భవితవ్యం ఆక్టోబర్‌ 30న భారత్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఒక వేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే.. పాకిస్తాన్‌ సెమీస్‌ దాదాపు గల్లంతు అయినట్లే.

భారత్‌తో మ్యాచ్‌ అనంతరం దక్షిణాఫ్రికా.. పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో ఆడనుంది. భారత్‌పై విజయం సాధించి.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో అయినా దక్షిణాఫ్రికా గెలిస్తే చాలు నేరుగా సెమీఫైనల్లో అడుగుపెడుతోంది. ఒక వేళ దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా భారత్‌, పాకిస్తాన్‌ వంటి జట్లపై ఓటమి చెందితే.. అప్పుడు  బాబర్‌ సేన ఆరు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. దక్షిణాప్రికా జట్టు నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించినా వారి ఖాతాలో కేవలం 5 పాయింట్ల మాత్రమే ఉంటాయి.

ఇక భారత్‌ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీలో భారత్‌ సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమైంది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న టీమిండియా.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే చాలు సెమీఫైనల్లో అడుగు పెడుతుంది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా,బంగ్లాదేశ్‌, జింబాబ్వేతో తలపడుతోంది.

ప్రస్తుత భారత్‌ దూకుడు చూస్తే ఈ రెండు జట్లపై సునాయసంగా విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా గ్రూపు-2 నుంచి పాయింట్ల పట్టికలో భారత్‌ 4,  దక్షిణాఫ్రికా 3 పాయింట్లతో తొలి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే సెమీఫైనల్‌కు చేరుతాయి.
చదవండి: Sikandar Raza: పాక్‌ మూలాలున్న క్రికెటర్‌ ముచ్చెమటలు పట్టించాడు

Poll
Loading...
మరిన్ని వార్తలు