T20 World Cup 2022: 'కోహ్లి'నూర్‌ విజయం

24 Oct, 2022 05:05 IST|Sakshi

భారత స్టార్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌

పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

పాకిస్తాన్‌పై టీమిండియా విజయం

అద్భుతం... అసాధారణం... అనిర్వచనీయం... ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏ తీరుగా ప్రశంసించినా తక్కువే. టి20 క్రికెట్‌ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా దాయాదుల మధ్య సమరం జరిగింది. ఒకదశలో పాకిస్తాన్‌ గెలవడం ఖాయమనిపించింది. కానీ భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అసమాన పోరాటం చేశాడు. చిరకాలం అభిమానుల మదిలో మెదిలేలా కళ్లు చెదిరే షాట్‌లు ఆడాడు. హార్దిక్‌ పాండ్యాతో కలిసి భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు. కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. దీపావళి పండగకు దేశానికి విజయకానుక ఇచ్చాడు.   

మెల్‌బోర్న్‌: భారత్‌ ఏ టోర్నీలో ఓడిందో... అక్కడే బదులు తీర్చుకుంది. ఎవరిని (షాహిన్‌ అఫ్రిది) చితకబాదాలనుకుందో అతన్నే బాగా ఎదుర్కొంది. భారత బ్యాటర్లు, హిట్టర్లు నిరాశపరిచినా... అడుగడుగునా సవాళ్లు ఎదురైనా... ఒక్కో పరుగు బంగారమైనా... మోస్తరు లక్ష్యం కాస్తా కొండంత అయినా ... కోహ్లి ఆఖరిదాకా నిలిచి కరిగించాడు. ఇప్పటి కోహ్లికి అంత సీన్‌ ఉందా అనుకున్నవాళ్ల నోళ్లు మూయించి మునుపటి కోహ్లిలా పాక్‌పై శివమెత్తాడు.

తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ (53 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. దీంతో భారత్‌ 4 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆకాశం తాకే ఉత్కంఠభరిత పోరులో భారత్‌ ఆఖరిబంతికి గెలిచింది. గతేడాది దుబాయ్‌లో ఎదురైనా పరాజయానికి మెల్‌బోర్న్‌లో ప్రతీకారం తీర్చుకుంది. టి20 ప్రపంచకప్‌ ‘సూపర్‌ 12’ దశ గ్రూప్‌–2 లీగ్‌ మ్యాచ్‌లో మొదట పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది.

షాన్‌ మసూద్‌ (42 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. మిగతా వారిని అర్‌‡్షదీప్‌ (3/32), హార్దిక్‌ పాండ్యా (3/30) కట్టడి చేశారు. తర్వాత భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి అజేయ పోరాటం చేయగా, పాండ్యా (37 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. హారిస్‌ రవూఫ్‌ (2/36), నవాజ్‌ (2/42) భారత్‌ను ఇబ్బంది పెట్టారు.

గెలిచేదాకా క్రీజులోనే...
లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రాహుల్‌ (4), రోహిత్‌ (4) నిరాశపరిచారు. 2 ఫోర్లు కొట్టిన సూర్యకుమార్‌ (10 బంతుల్లో 15) జోరుకు రవూఫ్‌ తెరదించాడు. అక్షర్‌ పటేల్‌ (2)ను ముందుకు పంపితే రనౌటయ్యాడు. భారత్‌ స్కోరు 31/4. లక్ష్యం కష్టమైన ఈ దశలో కోహ్లి, పాండ్యా ఆదుకున్నారు. 25వ బంతిదాకా కోహ్లి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి 45/4 స్కోరు చేసిన భారత్‌కు 60 బంతుల్లో 115 పరుగుల లక్ష్యం కష్టమైంది.

నవాజ్‌ 12వ ఓవర్లో  ఎట్టకేలకు 25వ బంతిని ఎదుర్కొన్న కోహ్లి సిక్సర్‌ కొట్టాడు. ఆ ఓవర్లో హార్దిక్‌ కూడా 2 సిక్స్‌లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లలో వంద పరుగులు చేసిన భారత్‌కు 30 బంతుల్లో 60 పరుగుల సమీకరణం క్లిష్టంగా ఉంది. 18వ ఓవర్‌ నుంచి కోహ్లి ఆట మారిపోయింది. తొలి బంతిని బౌండరీకి తరలించిన అతను 43 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ సాధించాడు. షాహిన్‌ అఫ్రిది వేసిన ఆ ఓవర్లో మొత్తం 3 బౌండరీలు బాదాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ నిష్క్రమించినా తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును గెలిపించడంతో కోహ్లి సఫలమయ్యాడు. తొలి 20 బంతుల్లో 11 పరుగులే చేసిన కోహ్లి ఆఖరి 33 బంతుల్లో 71
పరుగులు చేయడం విశేషం. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న నెదర్లా్లండ్స్‌తో ఆడుతుంది.

స్కోరు వివరాలు
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (సి) భువనేశ్వర్‌ (బి) అర్‌‡్షదీప్‌ 4; బాబర్‌ ఆజమ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్‌‡్షదీప్‌ 0; షాన్‌ మసూద్‌ (నాటౌట్‌) 52; ఇఫ్తికార్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 51; షాదాబ్‌ ఖాన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ పాండ్యా 5; హైదర్‌ అలీ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ పాండ్యా 2; నవాజ్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) హార్దిక్‌ పాండ్యా 9; ఆసిఫ్‌ అలీ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) అర్‌‡్షదీప్‌ 2; షాహిన్‌ అఫ్రిది (సి అండ్‌ బి) భువనేశ్వర్‌ 16; హారిస్‌ రవూఫ్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల    
పతనం: 1–1, 2–15, 3–91, 4–96, 5–98, 6–115, 7–120, 8–151.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0– 22–1; అర్‌‡్షదీప్‌ 4–0–32–3; షమీ 4–0– 25–1; హార్దిక్‌ పాండ్యా 4–0–30–3; అశ్విన్‌ 3–0–23–0; అక్షర్‌ పటేల్‌ 1–0–21–0.

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) నసీమ్‌ షా 4; రోహిత్‌ శర్మ (సి) ఇఫ్తికార్‌ (బి) హారిస్‌ రవూఫ్‌ 4; కోహ్లి (నాటౌట్‌) 82; సూర్యకుమార్‌ (సి) రిజ్వాన్‌ (బి) 15; అక్షర్‌ పటేల్‌ (రనౌట్‌) 2; హార్దిక్‌ (సి) బాబర్‌ ఆజమ్‌ (బి) నవాజ్‌ 40; దినేశ్‌ కార్తీక్‌ (స్టంప్డ్‌) రిజ్వాన్‌ (బి) నవాజ్‌ 1; అశ్విన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1–7, 2–10, 3–26, 4–31, 5–144, 6–158.
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0–34–0; నసీమ్‌ షా 4–0–23–1; హారిస్‌ రవూఫ్‌ 4–0–36–2; షాదాబ్‌ ఖాన్‌ 4–0–21–0; నవాజ్‌ 4–0–42–2.  

ఆ రెండు సిక్స్‌లతో...
మ్యాచ్‌ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న ఎంసీజీ పిచ్‌పై కోహ్లి కోహినూర్‌ వజ్రంలాంటి ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన వేళ... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో హారిస్‌ రవూఫ్‌ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్‌ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్‌ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్‌ బాదాడు కోహ్లి. ఈ షాట్‌ మ్యాచ్‌లోనే హైలైట్‌. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్‌లెగ్‌లో ఫ్లిక్‌ షాట్‌తో సిక్స్‌గా మలిచాడు. భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు.  

బంతి బంతికీ ఉత్కంఠ...
గెలవడానికి భారత్‌ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్‌ హిట్టర్‌’ హార్దిక్‌     పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్‌ జోరు చూస్తుంటే మూడు షాట్‌లలో మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది.  
19.1 నవాజ్‌ వేసిన తొలి బంతికి భారీ షాట్‌ ఆడిన పాండ్యా అవుటయ్యాడు.  
►19.2క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్‌ ఇచ్చాడు.

►19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు.
►19.4 నవాజ్‌ వేసిన ఫుల్‌టాస్‌ను కోహ్లి డీప్‌ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచాడు. అంపైర్‌ దీనిని ‘హైట్‌ నోబాల్‌గా’ ప్రకటించాడు. దీంతో భారత్‌ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్‌కు ‘ఫ్రీ హిట్‌’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది.  
►19.4 ఈసారి నవాజ్‌ వైడ్‌ వేశాడు. ఫ్రీ హిట్‌ సజీవంగా నిలిచింది.  
►19.4 ఫ్రీ హిట్‌ బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. ‘ఫ్రీ హిట్‌’పై కేవలం రనౌట్‌ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్‌ మ్యాన్‌ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్‌ 3 ‘బై’ పరుగులు తీశారు! విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది.  
►19.5 దినేశ్‌ కార్తీక్‌ స్వీప్‌ షాట్‌ ఆడగా బంతి అతని ప్యాడ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్‌ క్రీజులోకి వచ్చేలోపు పాక్‌ కీపర్‌ రిజ్వాన్‌ స్టంపౌట్‌ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది.  
19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్‌ లెగ్‌ సైడ్‌లో బంతి వేశాడు. అంపైర్‌ దానిని వైడ్‌గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది.  
►19.6 ఈసారి నవాజ్‌ వేసిన బంతిని అశ్విన్‌ మిడాఫ్‌లో ఫీల్డర్‌ మీదుగా షాట్‌ ఆడాడు. పరుగు తీశాడు. భారత్‌ విజయం ఖరారైంది.  

>
మరిన్ని వార్తలు