T20 World Cup 2022: దర్జాగా సెమీస్‌కు...

7 Nov, 2022 04:10 IST|Sakshi

జింబాబ్వేపై భారత్‌ 71 పరుగులతో విజయం

గ్రూప్‌–2లో అగ్రస్థానం

సూర్యకుమార్‌ మెరుపులు

రాణించిన రాహుల్, అశ్విన్‌

గురువారం సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ‘ఢీ’

గత ఏడాది టి20 వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశలోనే ఇంటికొచ్చిన భారత్‌ ఈసారి టోర్నీలో లీగ్‌ టాపర్‌గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా చిన్న జట్లను తేలిగ్గా తీసుకోలేదు. పెద్ద జట్లతో గాభరా పడలేదు. ప్రతీ పోరు విలువైందన్నట్లుగానే ఆడింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ మినహా ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్లు, బౌలర్లు చక్కగా రాణించారు. సమష్టి బాధ్యత కనబరిచారు. దీంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా మారింది. గురువారం అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో రోహిత్‌ శర్మ బృందం సమరానికి సై అంటోంది.   

మెల్‌బోర్న్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ను సహచరులంతా అతని పేరులోని మూడక్షరాలతో స్కై (ఎస్‌కేవై) అంటారు. ఈ ప్రపంచకప్‌లో అతను కూడా ఆ పేరుకు (ఆకాశం) తగ్గట్లే హద్దేలేని ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తున్నాడు. అభిమానుల్ని అలరిస్తున్నాడు. జింబాబ్వేతో పోరులో అయితే ‘సూపర్‌ సండే’ స్పెషల్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్య (25 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపుల సునామీతో... ‘సూపర్‌ 12’ గ్రూప్‌–2 చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై జయభేరి మోగించి 8 పాయింట్లతో ‘టాపర్‌’గా నిలిచింది.

మొదట భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరిపించాడు. సీన్‌ విలియమ్స్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బర్ల్‌ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రజా (24 బంతుల్లో 34; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. అశ్విన్‌ (3/22), షమీ (2/14), హార్దిక్‌ పాండ్యా (2/16) ప్రత్యర్థిని మూకుమ్మడిగా దెబ్బకొట్టారు.

సూర్య ప్రతాపం...
ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌లో ‘భారత 360’ సూర్య బ్యాటింగ్‌ ఓ లెవెల్లో వుంది. ఈ మ్యాచ్‌లో అది మరో స్థాయికి చేరింది. సూర్య 12 ఓవర్‌ ఆఖరిబంతికి క్రీజులోకి వచ్చాడు. అప్పుడు టీమిండియా స్కోరు (87/2) వందయినా కాలేదు. అతను రాగానే రాహుల్‌ అవుటయ్యాడు. అవకాశమిచ్చిన రిషభ్‌ పంత్‌ (3) చేజార్చుకున్నాడు. స్కోరు 101/4గా ఉన్న దశలో జింబాబ్వే సంచలనంపై ఆశలు పెట్టుకోకుండా సూర్యకుమార్‌ రెచ్చిపోయాడు. కొన్నిషాట్లయితే ఊహకే అందవు. ఆఫ్‌సైడ్‌కు దూరంగా వెళుతున్న బంతుల్ని ఆన్‌సైడ్‌లో సిక్సర్లుగా మలచడం అద్భుతం. 15 ఓవర్లలో 107/4గా ఉన్న స్కోరు అతని సునామీ ఇన్నింగ్స్‌తో 186/5గా మ్యాచ్‌ ఛేంజింగ్‌ ఫిగర్‌ అయ్యింది.

ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో సూర్య వరుసగా 2 బౌండరీలు కొడితే పాండ్యా మరో ఫోర్‌ కొట్టాడు. 17వ ఓవర్‌ వేసిన ఎన్‌గరవా ఆఫ్‌సైడ్‌లో వేసిన వైడ్‌ యార్కర్‌లను 4, 6గా కొట్టడం మ్యాచ్‌కే హైలైట్‌. చటారా ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా బాదిన సిక్సర్, ఎన్‌గరవ ఆఖరి ఓవర్లో వరుసగా సూర్య 6, 2, 4, 6లతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో సూర్య (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. అంతకుముందు ఓపెనర్లలో రోహిత్‌ (15) విఫలమైనా... రాహుల్, కోహ్లి (25 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి స్కోరును నడిపించాడు. 34 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాహుల్‌ అర్ధశతకం సాధించాడు.

మన పేస్‌కు విలవిల
జింబాబ్వే బ్యాటర్లు లక్ష్యఛేదనను అటుంచి... అసలు క్రీజులో నిలిచేందుకే కష్టపడ్డారు. టాప్, మిడిలార్డర్‌ భారత పేస్‌ బౌలింగ్‌కు విలవిల్లాడింది. ఓపెనర్లు మదెవెర్‌ (0)ను భువీ, ఇర్విన్‌ (13)ను హార్దిక్, చకబ్వా (0)ను అర్‌‡్షదీప్, సీన్‌ విలియమ్స్‌ (11)ను షమీ... ఇలా వరుసలోని నలుగురు బ్యాటర్స్‌ను నలుగురు బౌలర్లు దెబ్బకొట్టడంతో జింబాబ్వే ఓటమివైపు నడిచింది. సికిందర్‌ రజా, రియాన్‌ బర్ల్‌ చేసిన పరుగులు జట్టు వంద దాటేందుకు ఉపయోగపడ్డాయి. ఆఖరి వరుస బ్యాటర్స్‌ అశ్విన్‌ ఉచ్చులో పడటంతో ఆలౌట్‌ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మసకద్జా (బి) సికందర్‌ 51; రోహిత్‌ (సి) మసకద్జా (బి) ముజరబాని 15; కోహ్లి (సి) బర్ల్‌ (బి) విలియమ్స్‌ 26; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 61; పంత్‌ (సి) బర్ల్‌ (బి) విలియమ్స్‌ 3; పాండ్యా (సి) ముజరబాని (బి) ఎన్‌గరవ 18; అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–87, 3–95, 4–101, 5–166.
బౌలింగ్‌: ఎన్‌గరవ 4–1–44–1, చటార 4–0–34–0, ముజరబాని 4–0–50–1, మసకద్జా 2–0–12–0, బర్ల్‌ 1–0–14–0, సికందర్‌ రజా 3–0–18–1, సీన్‌ విలియమ్స్‌ 2–0–9–2.

జింబాబ్వే ఇన్నింగ్స్‌: మదెవెర్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 0; ఇర్విన్‌ (సి అండ్‌ బి) పాండ్యా 13; చకబ్వా (బి) అర్‌‡్షదీప్‌ 0; విలియమ్స్‌ (సి) భువనేశ్వర్‌ (బి) 11; సికందర్‌ (సి) సూర్య (బి) పాండ్యా 34; టోని (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 5; బర్ల్‌ (బి) అశ్విన్‌ 35; మసకద్జా (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 1; ఎన్‌గరవ (బి) అశ్విన్‌ 1; చటార (సి
అండ్‌ బి) అక్షర్‌ 4; ముజరబాని (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్‌) 115.
వికెట్ల పతనం: 1–0, 2–2, 3–28, 4–31, 5–36, 6–96, 7–104, 8–106, 9–111, 10– 115.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–1–11–1, అర్‌‡్షదీప్‌ 2–0–9–1, షమీ 2–0–14–2, పాండ్యా 3–0– 16–2, అశ్విన్‌ 4–0–22–3, అక్షర్‌ 3.2–0–40–1.

1: క్యాలెండర్‌ ఇయర్‌లో అంతర్జాతీయ టి20ల్లో 1,000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ గుర్తింపు
పొందాడు. ఈ ఏడాది సూర్య 28 టి20 మ్యాచ్‌లు ఆడి 1,026 పరుగులు చేశాడు.
21:ఈ ఏడాది రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టి20ల్లో భారత్‌ సాధించిన విజయాలు. క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా బాబర్‌ ఆజమ్‌ (2021లో 20) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ అధిగమించాడు.

>
మరిన్ని వార్తలు