T20 World Cup 2022: ఫిట్‌నెస్‌ టెస్టులో క్లియరెన్స్‌.. ఆస్ట్రేలియాకు షమీ

12 Oct, 2022 10:50 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్‌న్యూస్‌. టీమిండియా ఫ్రంట్‌లైన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో షమీకి ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించారు. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్‌కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను ముగించుకున్న శ్రేయాస్‌ అయ్యర్‌, సిరాజ్‌, రవి బిష్ణోయిలు కూడా షమీతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

ఇక వెన్నునొప్పితో మేజర్‌ టోర్నీకి దూరమైన బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై బీసీసీఐ తర్జన​ భర్జన పడుతున్న వేళ షమీ ఫిట్‌నెస్‌ టెస్టులో పాసవ్వడం ఊరట కలిగించింది.అయితే బుమ్రా స్థానంలో ఇంకా ఎవరిని రీప్లేస్‌ చేయకపోవడంతో ఉత్కంఠ మాత్రం అలానే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షమీ అయితేనే బుమ్రా స్థానంలో కరెక్టని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హర్ష్‌దీప్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికి హర్షల్‌ పటేల్‌ మాత్రం ఇంకా గాడిన పడలేదు. దీంతో ఫ్రంట్‌ లైన్‌ బౌలర్‌గా షమీ టీమిండియా బౌలింగ్‌ను నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా షమీ బౌలింగ్‌ ఆస్ట్రేలియా పిచ్‌లకు సరిగ్గా సరిపోతుంది. 

షమీ ఫిట్‌నెస్‌ టెస్టు క్లియర్‌ చేయగా.. దీపక్‌ చహర్‌ మాత్రం ఇంకా ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో తొలి టి20 సందర్భంగా గాయపడిన చహర్‌ బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలోనే ఉన్నాడు. ఎలాగూ దీపక్‌ చహర్‌ టి20 ప్రపంచకప్‌కు రిజర్వ్‌ ప్లేయర్‌గానే ఉండడంతో షమీ తుది జట్టులో ఉండడం ఖాయం. చహర్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న తర్వాతే ఆస్ట్రేలియా బయలుదేరనున్నాడు. మరో బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఉన్నప్పటికి అతన్ని నమ్మలేని పరిస్థితి. అయితే ఆస్ట్రేలియాలో సిరాజ్‌కు మంచి రికార్డు ఉండడం అతనికి సానుకూలాంశం. 

అయితే షమీ ఈ ఏడాది ఒక్క టి20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని బుమ్రాకు సపోర్ట్‌గా షమీని కూడా రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ప్రాక్టీస్‌ కోసం షమీని ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ కోసం జట్టులోకి తీసుకున్నారు. కానీ షమీ కరోనా బారిన పడడంతో ఆసీస్‌ సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. తాజాగా ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైన షమీ.. ఆస్ట్రేలియాలో నేరుగా ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఏది ఏమైనా షమీ ఫిట్‌నెస్‌ టెస్టులో పాసయ్యి ఆస్ట్రేలియాకు రానుండడంతో టీమిండియా బౌలింగ్‌లో బలం పెరిగినట్లే.

చదవండి: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి

'మెడల్స్‌ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్‌ స్విమ్మర్‌కు అవమానం

మరిన్ని వార్తలు