T20 World Cup 2022: ఉత్కంఠ పోరులో యూఏఈని ఖంగుతినిపించిన నెదర్లాండ్స్‌

16 Oct, 2022 17:49 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ 2022కు అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్‌ శ్రీలంకపై సంచలన విజయం సాధించగా.. ఆఖరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో యూఏఈని నెదర్లాండ్స్‌ను ఖంగుతినిపించింది. 

చిన్న జట్ల మధ్య జరిగిన ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగా.. ఛేదనలో నెదర్లాండ్స్‌ మధ్యలో తడబడినప్పటికీ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

నెదర్లాండ్స్‌ గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 6 పరుగులు అవసరం కాగా.. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (16 నాటౌట్‌), లొగాన్‌ వాన్‌ బీక్‌ (4 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. యూఏఈ చేసింది తక్కువ పరుగులే అయినా దాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి అందరిని ఆకట్టుకుంది. 

యూఏఈ ఇన్నింగ్స్‌లో  ముహమ్మద్‌ వసీమ్‌ (47 బంతుల్లో 41; ఫోర్‌, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. నెదర్లాండ్స్‌ బౌలర్లు బాస్‌ డి లీడ్‌ (3/19), ఫ్రెడ్‌ క్లాస్సెన్‌ (2/13), టిమ్‌ ప్రింగిల్‌ (1/13), వాన్‌ డెర్‌ మెర్వ్‌ (1/19) అద్భుతంగా బౌలింగ్‌ చేసి యూఏఈని నామమాత్రపు స్కోర్‌కే పరిమితం​ చేశారు.

అనంతరం సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను యూఏఈ బౌలర్లు జునైద్‌ సిద్ధిఖీ (3/24), అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ (1/15), జహూర్‌ ఖాన్‌ (1/11), కార్తీక్‌ మెయ్యప్పన్‌ (1/22), బాసిల్‌ హమీద్‌ (1/7) వణికించారు. వీరి ధాటికి నెదర్లాండ్స్‌ ఓ దశలో ఓటమి దిశగా సాగింది.

అయితే కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, లొగాన్‌ వాన్‌ బీక్‌ సంయమనంతో ఆడి నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లు లక్ష్యాన్ని ఛేదించింది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ ఓడౌడ్‌ (23) టాప్‌ స్కోరర్‌ కాగా.. మిగిలిన వారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.  

    

మరిన్ని వార్తలు