T20 World Cup 2022: ఆస్ట్రేలియా చిత్తు చిత్తుగా...

23 Oct, 2022 04:43 IST|Sakshi

89 పరుగులతో న్యూజిలాండ్‌ ఘన విజయం

ప్రపంచకప్‌ తొలి పోరులో ఆతిథ్య జట్టుకు షాక్‌  

సిడ్నీ: టి20 ప్రపంచకప్‌ ‘సూపర్‌ 12’ పోరు అనూహ్య ఫలితంతో మొదలైంది. సొంతగడ్డపై టైటిల్‌ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు టి20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే భారీ పరాజయం ఎదురైంది. గత వరల్డ్‌ కప్‌ ఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ న్యూజిలాండ్‌ ఆతిథ్య జట్టును 89 పరుగుల తేడాతో ఓడించి షాక్‌ ఇచ్చింది.

2011 తర్వాత ఆసీస్‌ గడ్డపై కివీస్‌కు అన్ని ఫార్మాట్‌లలో కలిపి ఇదే తొలి విజయం కాగా, 15 ఓటముల తర్వాత 16వ మ్యాచ్‌లో గెలుపు దక్కింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డెవాన్‌ కాన్వే (58 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు.

మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (16 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఇచ్చిన శుభారంభం కూడా కివీస్‌ భారీ స్కోరుకు కారణమైంది. చివర్లో జేమ్స్‌ నీషమ్‌ (13 బంతుల్లో 26 నాటౌట్‌; 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడి స్కోరును 200 పరుగులకు చేర్చాడు. హాజల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కగా, ఐదుగురు ఆసీస్‌ బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేక, మరో 23 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలిపోవడం విశేషం.

కివీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయిన ఆసీస్‌ 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్‌ (20 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ప్యాట్‌ కమిన్స్‌ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రం ఫర్వాలేదనిపించారు. సాన్‌ట్నర్‌కు 3 వికెట్లు దక్కగా, 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన టిమ్‌ సౌతీ... అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (125) తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

మరిన్ని వార్తలు