T20 WC 2022: ప్రపంచకప్‌ టోర్నీ.. ప్రాక్టీసు​ మొదలుపెట్టిన టీమిండియా

7 Oct, 2022 14:59 IST|Sakshi
టీమిండియా (ఫైల్‌ ఫొటో)

T20 World Cup 2022- Team India Preparations Pic Viral: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ప్రాక్టీసు​ మొదలుపెట్టింది. పెర్త్‌లోని ఐకానిక్‌ స్టేడియం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డబ్ల్యూఏసీఏ) గ్రౌండ్‌ వేదికగా ఐసీసీ మెగా ఈవెంట్‌ సన్నాహకాలు షురూ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ట్విటర్‌లో షేర్‌ చేసింది.

హెల్లో.. డబ్ల్యూఏసీఏ..
‘‘హెల్లో.. డబ్ల్యూఏసీఏలోకి స్వాగతం.. టీమిండియా తమ మొదటి ట్రెయినింగ్‌ సెషన్‌కు సిద్ధమైంది’’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి
ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు గురువారం ముంబై నుంచి ఆస్ట్రేలియాకు బయల్దేరింది. ఈ సందర్భంగా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా టీమిండియా ఆటగాళ్లంతా తమకు విష్‌ చేయడానికి వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సంతోషపరిచారు. 

ఇక టీమిండియాను చీర్‌ చేస్తూ తీసుకువచ్చిన కేక్‌ను వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ కట్‌చేశాడు. ఇలా కోలాహలం నడుమ ఆస్ట్రేలియాకు పయనమైన భారత జట్టు.. అక్కడికి చేరుకున్న మరుసటి రోజే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌తో పాటు హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్‌ సేన ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు..
మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఆసీస్‌, దక్షిణాఫ్రికాలోత టీ20 సిరీస్‌లను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో భాగంగా.. అక్టోబరు 10, 13 తేదీల్లో పెర్త్‌ వేదికగా టీమిండియా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది. 

ఆ జట్లతో వార్మప్‌ మ్యాచ్‌లు
ఆ తర్వాత ఆసీస్‌, న్యూజిలాండ్‌తో గబ్బా స్టేడియంలో వార్నప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబరు 23న మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌ వేదికగా టీమిండియా ఈ ఈవెంట్లో తమ అసలైన ప్రయాణం ఆరంభించనుంది.

అతడి స్థానంలో ఎవరో?!
కాగా ప్రధాన ఓపెనర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరం కాగా 14 మంది సభ్యులతో టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారన్న అంశం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహ్మద్‌ షమీ లేదంటే మహ్మద్‌ సిరాజ్‌ లేదా స్టాండ్‌ బైగా ఉన్న దీపక్‌ చహర్‌లలో ఎవరో ఒకరు బుమ్రా ప్లేస్‌లో జట్టులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: Pak Vs Ban 1st T20: చెలరేగిన రిజ్వాన్‌.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్‌ విజయం
IND vs SA: 'మీ కంటే బాల్‌ బాయ్‌ బెటర్‌.. అద్భుతమైన ‍క్యాచ్‌ పట్టాడు'

మరిన్ని వార్తలు