T20 World Cup: రోహిత్‌ శర్మ అరుదైన ఘనత.. ఆ ఆరుగురు సైతం

18 Oct, 2021 18:59 IST|Sakshi

T20 World Cup: Seven players who featured in all editions: 2007- 2016 వరకు ఇప్పటికీ 6 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలు జరిగాయి. తొట్టతొలి పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ను ముద్దాడి జగజ్జేతగా నిలిచింది ధోని సేన. ఆ తర్వాత పాకిస్తాన్(2009)‌, ఇంగ్లండ్(2010)‌, వెస్టిండీస్(2012, 2016- రెండుసార్లు), శ్రీలంక(2014) ఈ ఘనత సాధించాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా విండీస్‌ జట్టు బరిలోకి దిగనుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో తమ తమ జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?!

హిట్‌మ్యాన్‌ అరుదైన ఘనత
టీమిండియా వైస్‌ కెప్టెన్‌‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) 2007 నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తాజా ఈవెంట్‌లోనూ అతడు కీలక పాత్ర పోషించనున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో 28 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ.. 673 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 79(నాటౌట్‌). 

షకీబ్‌ అల్‌ హసన్‌(బంగ్లాదేశ్‌)
ఆధునిక క్రికెట్‌ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు షకీబ్‌ అల్‌ హసన్‌(Shakib Al Hasan). టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడిన అతడు... 567 పరుగులు చేశాడు. 30 వికెట్లు పడగొట్టాడు. సూపర్‌ 12కు బంగ్లాదేశ్‌ అర్హత సాధించే క్రమంలో షకీబ్‌ పాత్ర కీలకం కానుంది.

కాగా టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్‌ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక బౌలర్‌ లసిత్‌ మలింగ(107 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును షకీబ్(108) అధిగమించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆరు పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. 

డ్వేన్‌ బ్రావో(వెస్టిండీస్‌)
టీ20 ఫార్మాట్‌లో తొలి 300, 400, 500 వికెట్లు తీసిన విండీస్‌ క్రికెట్‌ స్టార్‌ డ్వేన్‌ బ్రావో(Dwayne Bravo). బ్యాటర్‌గానూ సత్తా చాటిన అతడు మెగా టోర్నీలో 504 పరుగులు చేశాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ ట్రోఫీ వేటలో ఈ ఆల్‌రౌండర్‌ ప్రముఖ పాత్ర పోషించనున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మహ్మదుల్లా(బంగ్లాదేశ్‌)
టీ20 వరల్డ్‌కప్‌-2021లో బంగ్లాదేశ్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు మహ్మదుల్లా(Mahmudullah). మిడిలార్డర్‌ బ్యాటర్‌గా, ఆఫ్‌ స్సిన్నర్‌గా ఉన్న అతడు ఇంతవరకు మెగా ఈవెంట్‌లో మెరుగ్గా రాణించింది లేదు. 2007-16 వరకు 22 మ్యాచ్‌లు ఆడిన మహ్మదుల్లా కేవలం 194 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు.

ముష్ఫికర్‌ రహీం(బంగ్లాదేశ్‌)
వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రహీమ్‌(Mushfiqur Rahim)ది కూడా మహ్మదుల్లా లాంటి కథే. ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో 20 ఇన్నింగ్స్‌ ఆడిన అతడు 258 పరుగులు సాధించాడు. 19 డిస్మిసల్స్‌ చేశాడు.

క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌)
యూనివర్సల్‌ బాస్‌, బిగ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌(Chris Gayle) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫాస్టెస్ట్‌ సెంచరీ, అత్యధిక సిక్సర్లు, అత్యధిక పరుగులు.. ఇలా ఒక్కటేమిటి.. పొట్టి ఫార్మాట్‌లో గేల్‌ సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఇప్పటికే ఆరుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో విండీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 920 పరుగులు చేశాడు.  శ్రీలంక కెప్టెన్‌ మహేల జయవర్దనే(1016 రన్స్‌) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గేల్‌ కావడం విశేషం.

షోయబ్‌ మాలిక్‌(పాకిస్తాన్‌)
ఇప్పటికే పాక్‌ తరఫున ఆరుసార్లు ఈ మెగా టోర్నీలో పాల్గొన్న వెటరన్‌ ప్లేయర్‌ షోయబ్‌ మాలిక్‌(Shoaib Malik)కు.. ఈసారి సొహైబ్‌ మక్సూద్‌ గాయపడటంతో అవకాశం లభించింది. కాగా 2009లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టులో షోయబ్‌ మాలిక్‌ సభ్యుడు. ఈ ఈవెంట్‌లో ఇప్పటి వరకు అతడు 2335 పరుగులు చేయడం సహా 28 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు.

చదవండి: T20 WC 2021: అరె ఏంట్రా ఇది.. పాపం బంగ్లాదేశ్‌ కెప్టెన్‌... అసలు మాట్లాడనిస్తే కదా!

మరిన్ని వార్తలు