టీ20 వరల్డ్‌కప్‌-2022 గెలిచిన టీమిండియా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం

17 Dec, 2022 17:27 IST|Sakshi

T20 World Cup For Blind: భారత అంధుల క్రికెట్‌ టీమ్‌ వరుసగా మూడసారి టీ20 వరల్డ్‌కప్‌ కైవసం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (డిసెంబర్‌ 17) జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌.. బంగ్లాదేశ్‌ను 120 తేడాతో ఓడించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన భారత్ ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. 

సునీల్‌ రమేశ్‌ (63 బంతుల్లో 136), అర్జున్‌ కుమార్‌ రెడ్డి (50 బంతుల్లో 100 నాటౌట్‌) సెంచరీలతో రెచ్చిపోవడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం 278 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో లలిత్‌ మీనా, అజయ్‌ కుమార్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌ గెలవడం ఇది వరుసగా మూడసారి. 2012లో జరిగిన ఇనాగురల్‌ టోర్నీలో భారత్‌ పాకిస్తాన్‌ను ఖంగుతినిపించి, తొలిసారి ఈ ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. అనంతరం 2017లో జరిగిన రెండో ఎడిషన్‌లోనూ భారత్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ ఓడించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది.

తాజాగా జరిగిన టోర్నీలో గెలవడం ద్వారా భారత్‌ హ్యాట్రిక్‌ వరల్డ్‌కప్‌లు సాధించింది. హ్యాట్రిక్‌ వరల్డ్‌కప్‌లు సాధించిన టీమిండియా వన్డే ఫార్మాట్‌లో జరిగే వరల్డ్‌కప్‌లను కూడా రెండుసార్లు (2014, 2018) కైవసం చేసుకుంది. ఈ రెండుసార్లు కూడా భారత్‌.. ఫైనల్లో పాకిస్తాన్‌పైనే విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు