T20 World Cup: అయ్యో బుమ్రా..!

30 Sep, 2022 04:37 IST|Sakshi

భారత స్టార్‌ పేసర్‌కు వెన్ను గాయం

టి20 ప్రపంచకప్‌కు దూరం

షమీ లేదా చహర్‌కు అవకాశం

టి20 ప్రపంచకప్‌కు బయల్దేరక ముందే భారత క్రికెట్‌ జట్టుకు పెద్ద షాక్‌! ఆసీస్‌ గడ్డపై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించగలడని భావించిన స్టార్‌ పేసర్‌  ఇప్పుడు టోర్నీకే దూరం కానున్నాడు. వెన్ను నొప్పి గాయం (బ్యాక్‌ స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌)తో బాధపడుతున్న జస్‌ప్రీత్‌ బుమ్రా నొప్పి తిరగబెట్టడంతో తప్పనిసరిగా ఆటకు విరామం పలకాల్సి    వచ్చింది. దాంతో అతను టి20 ప్రపంచకప్‌ వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పటికే ఆల్‌రౌండర్‌ రవీంద్ర    జడేజా మోకాలి గాయంతో మెగా టోర్నీనుంచి తప్పుకోగా, ఇప్పుడు బుమ్రా కూడా లేకపోవడం టీమిండియాను బలహీనంగా మార్చింది.  

న్యూఢిల్లీ: గాయంనుంచి కోలుకొని విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆట రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో, మూడో టి20లో ఆడిన అతను బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో బుమ్రాకు వెన్ను నొప్పి వచ్చిందని, అందుకే మ్యాచ్‌ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది.

అయితే ఆ వెన్ను బాధ అంతటితో ఆగిపోలేదని బుధవారం సాయంత్రం తేలింది. తిరువనంతపురంనుంచి బుమ్రా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి చేరుకున్నాడు. పరీక్షల అనంతరం గాయం తీవ్రమైందని తేలగా, కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావాల్సి ఉందని అర్థమైంది. బీసీసీఐ అధికారికంగా బుమ్రా గాయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన చేయకపోయినా...బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘బుమ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ టి20 ప్రపంచకప్‌ ఆడే అవకాశం లేదు.

అతని వెన్ను గాయం చాలా తీవ్రమైంది. స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌ కాబట్టి కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది’ అని ఆయన వెల్లడించారు. వరల్డ్‌ కప్‌కు ప్రకటించిన జట్టులో స్టాండ్‌బైలుగా ఇద్దరు పేసర్లు అందుబాటులో ఉన్నారు. మొహమ్మద్‌ షమీ లేదా దీపక్‌ చహర్‌లలో ఒకరిని ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బుమ్రా గాయాన్ని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తారని, టీమ్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న అక్టోబర్‌ 15 వరకు వేచి చూడవచ్చని చెబుతున్నా... పూర్తి ఫిట్‌గా లేని ఆటగాడిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లే సాహసం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేయకపోవచ్చు.  

బలమే బలహీనతై...
‘బుమ్రా పూర్తి స్థాయిలో మళ్లీ బౌలింగ్‌ చేయడం సంతోషంగా అనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే వెన్ను నొప్పితో రెండు నెలలు విశ్రాంతి తీసుకొని మళ్లీ బౌలింగ్‌ చేయడం అంత సులువు కాదు. అతని ప్రదర్శన ఎలా ఉందన్నది అనవసరం. మెల్లగా లయ అందుకుంటున్నాడు. అతను తిరిగి రావడమే విశేషం. ’...ఆసీస్‌తో రెండో టి20 తర్వాత బుమ్రా గురించి రోహిత్‌ వ్యాఖ్య ఇది. అయితే మరో మ్యాచ్‌కే గాయం తిరగబెట్టి బుమ్రా మళ్లీ అందుబాటులో లేకుండా పోతాడని బహుశా రోహిత్‌ కూడా ఊహించి ఉండడు.

విజయావకాశాలు ప్రభావితం చేయగల తన స్టార్‌ బౌలర్‌ లేకపోవడం ఏ కెప్టెన్‌కైనా లోటే. అయితే బుమ్రా గాయాన్ని బోర్డు వైద్యులు, ఎన్‌సీఏ పర్యవేక్షించిన తీరే సరిగా కనిపించడం లేదు. బుమ్రా విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా ఏమీ ఆడటం లేదు. బోర్డు రొటేషన్‌ పాలసీ, వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతను చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. 2022లో అతను ఐపీఎల్‌తో పాటు 5 టెస్టులు, 5 వన్డేలు, 5 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడాడు. నిజానికి బుమ్రాకు స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌ కొత్త కాదు.

2019లోనే అతను ఇదే బాధతో మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. నిపుణులు చెప్పినదాని ప్రకారం అతని భిన్నమైన శైలే అందుకు ప్రధాన కారణం. వెన్నునొప్పితోనే అతను ఇటీవలే ఆసియా కప్‌లోనూ ఆడలేదు. అయితే సరిగ్గా ఇక్కడే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తొందరపాటు కనిపిస్తోంది. అతను పూర్తి స్థాయిలో కోలుకోకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసినట్లుగా అనిపిస్తోంది.

లేదంటే ఎన్‌సీఏ బుమ్రా గాయాన్ని సరిగ్గా అంచనా వేయలేక తగినంత రీహాబిలిటేషన్‌ లేకుండానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లుగా ఉంది.  ఎందుకంటే పూర్తి ఫిట్‌గా ఉంటే రెండు మ్యాచ్‌లకే గాయం తిరగబెట్టడం ఊహించలేనిది. ‘తక్కువ రనప్‌తో ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసేందుకు బుమ్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎంత కాలం ఇలా అతని శరీరం సహకరిస్తుందనేదే నా సందేహం. అది మానవశరీరం. మెషీన్‌ కాదు’ అని రెండేళ్ల క్రితం దిగ్గజ పేసర్‌ మైకేల్‌ హోల్డింగ్‌ చేసిన వ్యాఖ్య   ఇప్పుడు వాస్తవంగా మారినట్లు అనిపిస్తోంది.    
 

మరిన్ని వార్తలు