T20 World Cup: వరుస సిరీస్‌లు రద్దు.. ప్రతీకారం తీర్చుకోండి: ఇమ్రాన్‌ ఖాన్‌

23 Sep, 2021 15:42 IST|Sakshi

Imran Khan Comments Over Series Cancelations: న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్లు తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవడాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ), ఆటగాళ్లు, అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని సౌకర్యాలు అమర్చినప్పటికీ భద్రతా కారణాలు సాకుగా చూపి టూర్‌ రద్దు చేసుకున్నాయంటూ సదరు బోర్డులపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌.. టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌, ఇంగ్లండ్‌ జట్లను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని తమ జట్టుకు సూచించిన సంగతి తెలిసిందే. పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఇప్పుడు పాకిస్తాన్‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ఈ విషయంపై స్పందించాడు. పాక్‌ క్రికెట్‌ జట్టుతో బుధవారం భేటీ అయిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్తాన్‌ సురక్షిత దేశం.. మీ ప్రదర్శనను మెరుగుపరచుకోండి.. ఆ దేవుడు కరుణిస్తే... త్వరలోనే పాకిస్తాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. అయితే, ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్‌ ఉంది కదా. నువ్వు ముందుండి జట్టును నడిపించాలి. ప్రతీ ఒక్కరు బెబ్బులిలా ముందుకు దూకాలి. కార్నర్డ్‌ టైగర్స్‌(పాక్‌ జట్టు) సత్తా ఏమిటో వారికి చూపించాలి’’ అని కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు విజ్ఞప్తి చేశాడు.

ప్రధాన టోర్నీలో తఢాఖా చూపించాలని కోరాడు. ఇందుకు సంబంధించి ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ కథనం ప్రచురించింది. కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ జట్టు 1992లో వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేసిన ఇమ్రాన్‌.. మేజర్‌ ఈవెంట్‌లో రాణించాలని ఆటగాళ్లకు సూచించాడు. కాగా 18 ఏళ్ల తర్వాత పాక్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌.. భద్రతా కారణాల దృష్ట్యా వన్డే ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు టూర్‌ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ సైతం కివీస్‌ బాటలోనే నడవడంతో పీసీబీకి భంగపాటు తప్పలేదు.

చదవండి: కివీస్‌ జట్టుకు బెదిరింపులు భారత్‌ కుట్రే.. పాక్‌ మంత్రి సంచలన ఆరోపణ

Poll
Loading...
మరిన్ని వార్తలు