T20 World Cup: ఓటమితో ముగిసిన ‘సాధన’

14 Oct, 2022 01:34 IST|Sakshi

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ పరాజయం

36 పరుగులతో ‘వాకా’ గెలుపు  

పెర్త్‌: టి20 ప్రపంచకప్‌ అధికారిక వామప్‌ మ్యాచ్‌లకు ముందు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. సోమవారం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు గురువారం అదే జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. బౌన్సీ పిచ్‌ ఉండే ‘వాకా’ మైదానంలో పెర్త్‌ పేస్‌ బౌలర్లు టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

నిక్‌ హాబ్సన్‌ (41 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), డార్సీ షార్ట్‌ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 3 వికెట్లు పడగొట్టగా, హర్షల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌గా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌ (55 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.

హార్దిక్‌ పాండ్యా (17), దినేశ్‌ కార్తీక్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. అయితే టీమిండియా టాప్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయలేదు. రోహిత్, సూర్య గత మ్యాచ్‌లో ఆడగా, కోహ్లి రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం స్థానిక అభిమానులను నిరాశపర్చింది. అయితే మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌ ఫీల్డింగ్‌లో మాత్రం మైదానమంతటా చురుగ్గా వ్యవహరించారు. పెర్త్‌నుంచి బ్రిస్బేన్‌ చేరుకునే భారత జట్టు ఈ నెల 17న ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్‌తో వామప్‌ మ్యాచ్‌లలో తలపడుతుంది. 23న తమ తొలి పోరు లో పాకిస్తాన్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది.  
 

మరిన్ని వార్తలు