-

T20 World Cup Team India Squad 2021: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని

8 Sep, 2021 21:40 IST|Sakshi

రవిచంద్రన్‌ అశ్విన్‌కు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. టెస్టు స్పెషలిస్ట్‌గానే కెరీర్‌ కొనసాగిస్తున్నా గత నాలుగు మ్యాచ్‌లలో అవకాశం దక్కని అతనికి నాలుగేళ్ల తర్వాత మళ్లీ టి20 జట్టులోకి, అదీ ప్రపంచకప్‌ కోసం పిలుపు రావడం విశేషం. ఒమన్, యూఏఈలలో అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరిగే వరల్డ్‌కప్‌ లో పాల్గొనేందుకు బుధవారం ప్రకటించిన భారత బృందంలో అశ్విన్‌ చేరిక కాస్త ఆశ్చర్యపరచగా... లెగ్‌స్పిన్నర్‌ చహల్, ఓపెనర్‌ ధావన్‌లకు మాత్రం చోటు లభించలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన ఎమ్మెస్‌ ధోని ఈసారి కొత్తగా ‘మెంటార్‌’ పాత్రలో జట్టుతో కలిసి పని చేయబోతుండటం మరో అనూహ్య నిర్ణయం. కోహ్లి కెప్టెన్‌గా, రవిశాస్త్రి కోచ్‌గా, ధోని మార్గనిర్దేశనంలో ఈ జట్టు విశ్వ విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరం

ముంబై: టి20 వరల్డ్‌కప్‌–2021లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. కోహ్లి నాయకత్వంలోని ఈ టీమ్‌లో స్పిన్నర్లకు ప్రాధాన్యత లభించింది. యూఏఈలో ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జరిగే ఈ టోర్నీలో పిచ్‌లు బాగా నెమ్మదించి స్పిన్‌కు అనుకూలిస్తాయని భావించడం కూడా అందుకు కారణం. మరో ముగ్గురు రిజర్వ్‌ ఆటగాళ్లను కూడా టీమ్‌లోకి ఎంపిక చేశారు. అశ్విన్‌ ఎంపిక మినహా దాదాపు అందరూ కొన్నాళ్లుగా టీమిండియా తరఫున, ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నవారే ఉన్నారు.   

చదవండి: IND VS ENG: ఇంగ్లండ్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌.. షెడ్యూల్ ఇదే

సుందర్‌ దూరం కావడంతో... 
రవిచంద్రన్‌ అశ్విన్‌  2017 జూలైలో భారత్‌ తరఫున వెస్టిండీస్‌తో తన చివరి టి20 మ్యాచ్, అదే సిరీస్‌లో చివరిసారిగా వన్డే ఆడాడు. నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకు పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో అశ్విన్‌ నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టి20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. 2020 ఐపీఎల్‌లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసి ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో అశ్విన్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. నిజానికి చెన్నైకే చెందిన వాషింగ్టన్‌ సుందర్‌ ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో అశ్విన్‌ కు అవకాశం దక్కింది.  

చహల్, ధావన్‌ అవుట్‌... 
లెగ్‌స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్‌ ఖాయమని అనిపించినా... సెలక్టర్లు రాహుల్‌ చహర్‌కే ఓటు వేశారు. ఓవరాల్‌గా ఇద్దరి ప్రదర్శన బాగానే ఉన్నా, 2019 నుంచి చూస్తే చహల్‌ బౌలింగ్‌లో పదును తగ్గింది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతున్న రాహుల్‌ చహర్‌ వరల్డ్‌కప్‌ అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్‌ ప్రదర్శన ‘మిస్టరీ ఆఫ్‌ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తికి చాన్స్‌ ఇప్పించింది. జడేజా జట్టులో ఉండగా అక్షర్‌ పటేల్‌ ఎంపిక మాత్రం అనూహ్యం.

అయితే అతనికి మ్యాచ్‌ దక్కే అవకాశాలు తక్కువ. ముగ్గురు ప్రధాన పేసర్లు మాత్రమే జట్టులో ఉండగా... అక్షర్‌ స్థానంలో శార్దుల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే జట్టు మరింత సమతుల్యంగా కనిపించేది. ఇటీవల శ్రీలంకలో భారత జట్టు కెపె్టన్‌గా వ్యవహరించినా... వరల్డ్‌కప్‌ టీమ్‌ లోకి మాత్రం ధావన్‌ ఎంపిక కాలేకపోయాడు. చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేస్తున్నా, ఓపెనింగ్‌లో అవకాశం లేకపోవడంతో పక్కన పెట్టక తప్పలేదు. 

ఇంకా గడువుంది... 
ప్రస్తుతానికి జట్టును ప్రకటించినా... ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్‌ 10 వరకు టీమ్‌లో మార్పుచేర్పులు చేయవచ్చు. ఐపీఎల్‌ ముగిశాక అక్కడి ప్రదర్శనను బట్టి లేదా గాయాలవంటి కారణాలతో చివరి నిమిషంలో మార్పులకు చాన్స్‌ ఉంది.  

ధోని ముద్ర... 
2007లో కెప్టెన్‌గా జట్టుకు తొలి టి20 ప్రపంచకప్‌ అందించిన ధోని తర్వాతి ఐదు టోర్నీలలో కూడా సారథిగా వ్యవహరించాడు. ఐపీఎల్‌ మినహా రెండేళ్లుగా టీమిండియాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్న అతను... బోర్డు కార్యదర్శి జై షా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం ‘మెంటార్‌’గా ఉండేందుకు అంగీకరించాడు. కెపె్టన్, కోచ్‌లతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు. అయితే రవిశాస్త్రి రూపంలో హెడ్‌ కోచ్, టాప్‌ ప్లేయర్‌ కోహ్లి కెపె్టన్‌గా ఉన్న టీమ్‌కు అదనంగా ధోని మార్గనిర్దేశనం అవసరమా అనేదే చర్చనీయాంశం! 

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌ ఎంపికైనారు.

చదవండి: BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. కివీస్‌పై తొలిసారి..

మరిన్ని వార్తలు