T20 World Cup: ‘మా జట్టులో సగం మంది అక్కడే.. ఏ జట్టునైనా ఓడించగలం’

5 Oct, 2021 12:46 IST|Sakshi
టైమల్‌ మిల్స్‌(ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌)

Tymal Mills Comments On T20 World Cup: ఈనెల 17 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు తమ జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని ఇంగ్లండ్‌ బౌలర్‌ టైమల్‌ మిల్స్‌ అన్నాడు. ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌లోని సగం మంది సభ్యులు ఐపీఎల్‌ ఆడుతున్నారని, ఈ అనుభవం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. కాగా కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌-2021 సెప్టెంబరు 19 నుంచి తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. భారత్‌లో పరిస్థితులు అనుకూలించని కారణంగా యూఏఈ వేదికగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. 

ఇక ఐపీఎల్‌ ముగిసిన.. రెండు రోజుల వ్యవధిలోనే... ఐసీసీ మెగా ఈవెంట్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 17 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ సంబరానికి తెరలేవనుంది. యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో టైమల్‌ మిల్స్‌ మాట్లాడుతూ... ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు మా జట్టులోని సగం మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడతుండటం మాకు ప్రయోజనకరంగా మారింది. 

యూఏఈ పిచ్‌లపై ఆడటం వల్ల మంచి ప్రాక్టీసు లభిస్తుంది. అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు అవగాహన వస్తుంది. మేమంతా పూర్తి స్థాయిలో ఐసీసీ టోర్నీకి సిద్ధమవుతున్నాం. ఏ జట్టునైనా ఓడించగలమనే విశ్వాసం ఉంది. మా జట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎలాంటి పరిస్థితులకైనా తమను తాము మలచుకుని.. మెరుగ్గా రాణించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు’’ అని ధీమా వ్యక్తం చేశాడు. 

కాగా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చ‌ర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టైమ‌ల్ మిల్స్ సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సదరన్ బ్రేవ్‌ తరఫున అద్బుతంగా రాణించి ఫామ్‌లోకి వచ్చిన అతడికి ఈసీబీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటిచ్చింది. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మెర్గాన్(కేకేఆర్‌)‌, మొయిన్‌ అలీ(సీఎస్‌కే), సామ్‌ కరన్‌(సీఎస్‌కే), ఆదిల్‌ రషీద్(పంజాబ్‌ కింగ్స్‌)‌, జేసన్‌ రాయ్‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) తదితరులు ఐపీఎల్‌-2021 రెండో అంచెలో వివిధ జట్ల తరఫున ఆడుతున్నారు. ఇక టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా... దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో అక్టోబరు 23న వెస్టిండీస్‌తో ఇంగ్లండ్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్‌, జోస్ బ‌ట్ల‌ర్‌, సామ్ క‌ర్రన్‌, క్రిస్ జోర్డాన్‌, లియామ్ లివింగ్‌స్టోన్‌, డేవిడ్ మ‌లాన్‌, టైమ‌ల్ మిల్స్‌, ఆదిల్ ర‌షీద్‌, జేసన్ రాయ్‌, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్‌, మార్క్ వుడ్‌.

చదవండి: T20 World Cup: ఆ రెండు జట్లతోనే మాకు గట్టి పోటీ: జోస్‌ బట్లర్‌

>
మరిన్ని వార్తలు