T20 World Cup: ఆ రెండు జట్లతోనే మాకు గట్టి పోటీ: జోస్‌ బట్లర్‌

4 Oct, 2021 09:10 IST|Sakshi

Jos Buttler Picks These 2 Teams As England’s strongest Competitors: ఈనెల 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ కోసం క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో ఈసారి ఫైనల్‌ చేరేది ఎవరు, ప్రపంచ విజేతగా ఎవరు నిలుస్తారన్న అంశాలను సోషల్‌ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. అదే విధంగా.. క్రీడా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు, మెగా ఈవెంట్‌లో ఆడబోయే క్రికెటర్లు టోర్నీ గురించి తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇక ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ సైతం తమ గెలుపు అవకాశాల గురించి సిక్సెస్‌ క్రికెట్‌ క్లబ్‌లో జరిగిన ఈవెంట్‌లో మాట్లాడాడు.

టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీ ఫేవరెట్‌ జట్లలో తమ టీమ్‌ కూడా ఒకటన్న బట్లర్‌.. టీమిండియా, వెస్టిండీస్‌ నుంచి తమకు గట్టి పోటీ ఎదురవుతుందన్నాడు. అయితే, ఇంగ్లండ్‌ జట్టులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే వారిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాబోదన్నాడు. ఇక బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైన నేపథ్యంలో... ‘‘మాది అద్భుతమైన జట్టు. నిజానికి.. ఇద్దరు సూపర్‌స్టార్లు బెన్‌, జోఫ్రాను మేము బాగా మిస్సవుతాం. అయితే, మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల విన్నర్స్‌ మా జట్టులో చాలా మందే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చాడు.

ఇతర జట్ల గురించి బట్లర్‌ మాట్లాడుతూ... ‘‘మాలాగే ప్రపంచంలో ఎన్నో అత్యద్భుతమైన జట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా, వెస్టిండీస్‌ చాలా స్ట్రాంగ్‌. టీ20 క్రికెట్‌లో విండీస్‌కు ఉన్న అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిక్స్‌లు బాదగల హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. అయితే, మేం కూడా తక్కువేమీ కాదు. సమిష్టిగా ముందుకు సాగుతూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే మేము విజయతీరాలకు చేరడం అసాధ్యమేమీ కాదు’’ అని పేర్కొన్నాడు.

కాగా తొట్టతొలి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవగా.. 2010లో ఇంగ్లండ్‌​ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక వెస్టిండీస్‌... 2012, 2016లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో అక్టోబరు 23న విండీస్‌ జట్టుతో జరిగే మ్యాచ్‌తో ఇంగ్లండ్‌ తమ టీ20 వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది.

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్‌, జోస్ బ‌ట్ల‌ర్‌, సామ్ క‌ర్రన్‌, క్రిస్ జోర్డాన్‌, లియామ్ లివింగ్‌స్టోన్‌, డేవిడ్ మ‌లాన్‌, టైమ‌ల్ మిల్స్‌, ఆదిల్ ర‌షీద్‌, జేసన్ రాయ్‌, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్‌, మార్క్ వుడ్‌.

చదవండి: మ్యాక్స్‌వెల్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు

మరిన్ని వార్తలు