T20 World Cup: అది నా కల.. కానీ సెలక్ట్‌ కాలేదు.. అయితేనేం..

17 Sep, 2021 10:44 IST|Sakshi
మహ్మద్‌ సిరాజ్‌(ఫొటో: ట్విటర్‌)

Mohammed Siraj About T20 World Cup Dream: టీ20 ప్రపంచకప్‌ ఆడాలన్నది తన కల అని టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అయితే, జట్టులో స్థానం పొందలేకపోవడం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు. ఏదేమైనా టీమిండియా తరఫున ఆడటం గొప్ప విషయమని, జట్టును గెలిపించడంలో తన పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు. కాగా అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌నకు బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఈ హైదరాబాదీకి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.

అనుభవజ్ఞులైన పేస్‌ త్రయం జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌కే సెలక్షన్‌ కమిటీ ఓటు వేసింది. దీంతో సిరాజ్‌కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన సిరాజ్‌.. జట్టులో స్థానం దక్కకపోవడం బాధించిందన్నాడు.  ‘‘ టీ20 వరల్డ్‌ కప్‌ ఆడాలనేది నా కల. కానీ, సెలక్షన్‌ అనేది మన చేతిలో ఉండదు కదా. ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదు. 

చదవండి: T20 World Cup: అశ్విన్‌కు అది కన్సోలేషన్‌ ప్రైజ్‌ లాంటిది.. తుదిజట్టులో ఉంటాడా

నా ముందు పెద్ద లక్ష్యం ఉంది. టీమిండియా విజయాల్లో నాదైన పాత్ర పోషించాలని భావిస్తున్నా. విధిరాతను నేను నమ్ముతాను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ నేపథ్యంలో హైదరాబాద్‌ తరఫున ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సిరాజ్‌ ఈ సందర్భంగా చెప్పాడు. ‘‘దేశవాళీ క్రికెట్‌లోనూ నా జట్టు తరఫున కీలక పాత్ర పోషించాలనేది నా కల. అయితే, ఎలైట్‌ గ్రూప్‌ ఆఫ్‌ రంజీ ట్రోఫీలో మా జట్టు లేకపోవడం నిరాశకు గురిచేసింది. టీ20 టోర్నీకి మాత్రం అందుబాటులో ఉంటాను’’ అని స్పష్టం చేశాడు. 

ఇక హనుమ విహారి హైదరాబాద్‌ జట్టుకు తిరిగి ఆడనుండటం శుభ పరిణామమని సిరాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా... ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 27 ఏళ్ల సిరాజ్‌.. ఇప్పటి వరకు తొమ్మిది టెస్టులాడి 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు.

చదవండి: Irfan Pathan: ఇది ఊహించలేదు.. కోహ్లి నిర్ణయం షాక్‌కు గురిచేసింది

టీ20 ప్రపంచకప్‌ భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.
స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు