T20 World Cup 2022: ప్రతి మ్యాచ్‌లో మార్పులు ఉంటాయి.. టీమిండియా కెప్టెన్‌

22 Oct, 2022 19:28 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌లో తుది జట్టు కూర్పుపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతి మ్యాచ్‌లో ఒకటి, రెండు మార్పులు తప్పక ఉంటాయని.. టీమ్‌ స్రాటజీని ముందుగానే బయటపెట్టాడు. జట్టు అవసరాల మేరకు అప్పటి పరిస్థితిని బట్టి తగు మార్పులకు ముందే సిద్ధపడ్డామని పేర్కొన్నాడు. ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి డేటాను స్టడీ చేసిన తర్వాతే తుది జట్టు కూర్పు ఉంటుందని తెలిపాడు. జట్టు ప్రయోజనాల రిత్యా ప్రయోగాలకు వెనకాడేది లేదని స్పష్టం చేశాడు.

రేపు (అక్టోబర్‌ 23) జరుగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై గెలుపొందడమే ప్రస్తుతానికి తమ ముందున్న లక్ష్యమని అన్నాడు. తొమ్మిదేళ్లుగా తమను ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ దాహానికి ఈ వరల్డ్‌కప్‌తో తెరదించుతామని విశ్వాసం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది పాక్‌లో పర్యటించే (ఆసియా కప్‌ వన్డే టోర్నీ) అంశంపై రోహిత్‌ ఈ సందర్భంగా స్పందించాడు. టీమిండియా పాక్‌కు వెళ్లాలా లేదా అన్నది భారత ప్రభుత్వం, బీసీసీఐ పరిధిలోని అంశమని, ప్రస్తుతానిక తమ దృష్టి అంతా టీ20 వరల్డ్‌కప్‌పైనే ఉందని తెలిపాడు. 

కాగా, రోహిత్‌ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక టీమిండియాలో ఓ రేంజ్‌లో ప్రయోగాలు జరిగిన విషయం తెలిసిందే. ఓపెనర్ల దగ్గరి నుంచి, మిడిలార్డర్‌, వికెట్‌కీపర్లు, బౌలర్లు.. ఇలా ప్రతి విభాగంలో దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక ఊహించని మార్పును గమనించాం. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాక్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో ఎవరుంటారో, ఎవరి స్థానాలు గల్లంతవుతాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

Poll
Loading...
మరిన్ని వార్తలు