T20 World Cup 2021 IND Vs PAK: పాక్‌ జట్టుకు బంపర్‌ ఆఫర్‌.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడిస్తే..?

25 Oct, 2021 08:06 IST|Sakshi

Update:
ఇక భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు సరిగ్గా 16 రోజుల కిత్రం పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా తమ జట్టు గెలవాలని ఆకాక్షించగా ఆయన కల నెరవేరింది. దాయాది జట్ల పోరులో పాక్‌నే విజయం వరించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ను 10 వికెట్లతో చిత్తు చేసి వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్లు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో పాక్‌ జట్టు గెలుపొందింది.

PCB To Get Blank Cheque If Pakistan Beat Team India: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాక్‌ జట్ల మధ్య దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం​ వేదికగా ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టులో మనోస్థైర్యాన్ని నింపేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ రమీజ్‌ రాజా ఓ సంచలన ప్రకటన చేశాడు. మెగా ఈవెంట్‌లో భారత్‌ను మట్టికరిపిస్తే పాక్‌ జట్టుకు బ్లాంక్‌ చెక్‌ ఇస్తానని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. అలాగే తమ దేశ పర్యటనను అర్దాంతరంగా రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌ జట్టును కూడా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చాడు.

ఈ సందర్భంగా ఆయన బీసీసీఐని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీకి 90 శాతం నిధులు సమకూరుస్తుంది బీసీసీఐయేనని, భారత క్రికెట్‌ బోర్డు ఐసీసీకి నిధులు మళ్లించడం మానుకుంటే పీసీబీ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా, భారత్‌-పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న పొట్టి ప్రపంచకప్‌లో దాయాదులు మరోసారి ఎదురెదురుపడనున్నారు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్‌ జట్టు ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ మెగా ఈవెంట్‌లో ఇరు జట్లు 5 సార్లు తలపడగా.. 5 మ్యాచ్‌ల్లో టీమిండియానే గెలుపొందింది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021లో మేజర్‌ జట్ల మధ్య సూప‌ర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్‌ 23 నుంచి ప్రారంభమవుతాయి. లీగ్‌ దశలో టీమిండియా తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్‌ 24న పాక్‌తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
చదవండి: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్‌.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే...
 

>
మరిన్ని వార్తలు