ICC T20 World Cup 2021: ప్రపంచకప్‌ తరలిపోయినట్లే

6 Jun, 2021 03:43 IST|Sakshi
టి20 ప్రపంచకప్‌ ట్రోఫీతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా (ఫైల్‌)

న్యూఢిల్లీ: భారత్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై తమకు స్పష్టత ఇవ్వాలంటూ జూన్‌ 28 వరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఇటీవలే గడువు ఇచ్చింది. అయితే చివరి తేదీకి చాలా ముందే భారత క్రికెట్‌ బోర్డు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో జరగాల్సిన ఈ టోర్నీని తాము నిర్వహించలేమని ఐసీసీకి బీసీసీఐ ఇప్పటికే చెప్పేసినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా... అంతర్గతంగా తమ పరిస్థితిని వారికి బోర్డు వర్గాలు వెల్లడించాయి.

ఆతిథ్య హక్కులు తమ వద్దే ఉంచుకుంటూ యూఏఈ, ఒమన్‌లలో వరల్డ్‌కప్‌ జరిపితే తమకు అభ్యంతరం లేదని కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నిజాయితీగా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షా 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలలతో పోలిస్తే ఇది తక్కువ కావచ్చు. కానీ మూడో వేవ్‌ గురించి గానీ... అక్టోబర్‌–నవంబర్‌లలో ఏం జరగవచ్చనేది జూన్‌ 28న అంచనా వేయడం చాలా కష్టం.

ఎనిమిది టీమ్‌ల ఐపీఎల్‌నే తరలించినప్పుడు 16 జట్ల ప్రపంచకప్‌ ఎలా నిర్వహిస్తాం. ఐపీఎల్‌ తరలింపునకు వర్షాలు కారణం కాదనేది అందరికీ తెలుసు. అది సుమారు రూ.2,500 కోట్ల ఆదాయానికి సంబంధించిన విషయం. అయినా ప్రపంచకప్‌ ఆడేందుకు ఎంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్‌ రావడానికి ఇష్టపడతారు అనేది కూడా కీలకం కదా’ అని బీసీసీఐలో కీలక అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ప్రపంచకప్‌ అంటే ఐపీఎల్‌ లాంటిది కాదని... ఏదైనా ఒక అసోసియేట్‌ జట్టులో పొరపాటున కొందరికి కరోనా సోకితే ఇక ఆ జట్టు ఇతర ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కూడా ఉండదని టోర్నీలో పాల్గొనబోయే ఒక అసోసియేట్‌ టీమ్‌కు చెందిన ఆటగాడు అభిప్రాయపడ్డాడు.  

మస్కట్‌లోనూ మ్యాచ్‌లు...
వరల్డ్‌కప్‌ కోసం యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలతో పాటు అదనంగా పక్కనే ఉన్న ఒమన్‌ రాజధాని మస్కట్‌లోనూ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. 31 ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ కారణంగా యూఏఈలో పిచ్‌లు పూర్తిగా జీవం కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో అవి సాధారణ స్థితికి వచ్చేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరం. ఆ సమయంలో వరల్డ్‌కప్‌ ఆరంభ రౌండ్‌ల మ్యాచ్‌లు మస్కట్‌లో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తోంది. బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం వచ్చిన తర్వాత వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌పై స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు