T20 World Cup: ఆ నలుగురిని వెనక్కి పిలిపించిన బీసీసీఐ.. ఎందుకంటే!

23 Oct, 2021 12:11 IST|Sakshi

Team India send back four net bowlers: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి నెట్‌ బౌలర్లుగా ఎంపికైన నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ వెనక్కి పిలిపించినట్లు సమాచారం. కరణ్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, క్రిష్ణప్ప గౌతం ఇప్పటికే యూఏఈని వీడి భారత్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వీరంతా.. నవంబరు 4 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే క్రమంలో కావాల్సినంత ప్రాక్టీసు ఉండాలన్న ఉద్దేశంతోనే బీసీసీఐ వీరిని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు... ‘‘అవును.. ఒక్కసారి అసలు టోర్నీ(టీ20) ప్రారంభమైన తర్వాత పెద్దగా నెట్‌ సెషన్లు ఉండవు. కాబట్టి ఈ ఆటగాళ్లందరూ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతించేందుకు వీలుగా జాతీయ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లకు కావాల్సినంత ప్రాక్టీసు లభిస్తుంది’’ అని బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించినట్లు క్రికెట్‌.కామ్‌ పేర్కొంది.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సహా కరణ్‌, షాబాజ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, గౌతంను నెట్‌బౌలర్లుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అత్యవసర సమయంలో వీరు జట్టుతో చేరేందుకు వీలుగా ఈ మేరకు సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా నేటి నుంచి టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-12 రౌండ్‌ ఆరంభం కానుంది. ఈ క్రమంలో అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్‌తో కోహ్లి సేన వరల్డ్‌కప్‌ టోర్నీ ప్రయాణం ఆరంభించనుంది.

చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేన బలబలాలు ఏంటి.. ఏ ఆటగాడి రికార్డు ఎలా ఉంది?
T20 World Cup 2021: నమీబియా సంచలనం.. శ్రీలంక హ్యాట్రిక్‌.. సూపర్‌-12కు చేరిన జట్లు ఇవే

మరిన్ని వార్తలు