T20 WC: అతడు ఫామ్‌లో లేనంత మాత్రాన.. ఆందోళన అవసరం లేదు: కోహ్లి

17 Oct, 2021 12:28 IST|Sakshi

Virat Kohli Comments Bhuvneshwar Kumar: ఐపీఎల్‌-2021 సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు భువనేశ్వర్‌కుమార్‌. ఈ ఎడిషన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ఈ టీమిండియా పేసర్‌ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ 7.97. డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న భువీ... ఇలా ఫామ్‌లేమితో సతమతమవుతుండటం.. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టును కలవరపెట్టే అంశంగా పరిణమించింది. 

ఈ నేపథ్యంలో భువీ ఆట తీరుపై ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించగా... టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మాత్రం అతడికి మద్దతుగా నిలిచాడు. భువీ  అనుభవం తమకు కలిసి వచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. నేటి నుంచి(అక్టోబరు 17) టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ కెప్టెన్ల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కోహ్లి మాట్లాడాడు.

ఈ సందర్భంగా... ‘‘భువీ ప్రదర్శన గురించి అస్సలు ఆందోళన లేదు. తన ఎకానమీ రేటు బాగానే ఉంది. ఒత్తిడిలోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచే తన అనుభవం మాకు ఉపకరిస్తుంది. ఇటీవలి ఆర్సీబీ, సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో తను మెరుగ్గా రాణించాడు. తనేంటో నిరూపించడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

ఏ సమయంలో.. బంతిని ఎక్కడ వేయాలో తనకు అవగాహన ఉంటుంది. నిలకడైన ఆట తీరు కనబరచగలడు. తన అనుభవం, కచ్చితత్వం జట్టుకు విలువకట్టలేని ఆస్తి అని చెప్పవచ్చు’’ అని కోహ్లి... భువీపై ప్రశంసలు కురిపించాడు. కాగా అక్టోబరు 24న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రయాణం మొదలుకానుంది.

చదవండి: T20 WC Ind Vs Pak: కోహ్లి వద్ద అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి.. కానీ

>
మరిన్ని వార్తలు