SL Vs BAN: క్యాచ్‌ పడతానని ఊహించి ఉండడు.. అందుకే ఆ రియాక్షన్‌

19 May, 2022 17:48 IST|Sakshi

శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా ఆ జట్టు సీనియర్‌ బ్యాటర్‌ మాథ్యూస్‌ 14 బంతులెదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే డకౌట్‌ అయ్యాడు. తైజూల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో మాథ్యూస్‌ కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా ఔటయ్యాడు. తైజూల్‌ వేసిన బంతిని స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడే ప్రయత్నంలో బంతి ఫుల్‌టాస్‌ అయి బ్యాడ్‌ ఎడ్జ్‌ను తాకి వేగంగా వచ్చింది. క్యాచ్‌ కాష్టతరంగానే అనిపించినప్పటికి తైజూల్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత అతనిచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. క్యాచ్‌ పడతానని తైజూల్‌ ఊహించి ఉండడు.. అందుకే అలాంటి రియాక్షన్‌ ఇచ్చాడంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో మాథ్యూస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగుల మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. 397 బంతులెదుర్కొని 19 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 199 పరుగులు చేశాడు. అయితే 199 పరుగుల వద్ద ఔటైన మాథ్యూస్‌ ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో 99, 199 వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన తొలి బ్యాట్స్‌మన్‌గా మాథ్యూస్‌ నిలిచాడు.

ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి లంక 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. నిరోషన్‌ డిక్‌వెల్లా 61 నాటౌట్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. కరుణరత్నే 52, దినేష్‌ చండిమల్‌ 39, ధనుంజయ డిసిల్వా 33,కుషాల్‌ మెండిస్‌ 48 పరుగులు చేశారు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా మాథ్యూస్‌ నిలిచాడు.

చదవండి: KKR VS LSG: కెమెరాకు చిక్కిన మిస్టరీ గర్ల్‌.. తన అందంతో కట్టిపడేసింది

మరిన్ని వార్తలు