-

Taliban Ban Sports: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు..

8 Sep, 2021 17:03 IST|Sakshi

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. దీంతో అఫ్గాన్‌ ప్రజలు కంటి మీద కునుకులేకుండా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే తాలిబన్లు కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాస్తున్నారు. బాలికలకు విద్య అవసరం లేదంటూ, మహిళలు నాలుగు గోడల మధ్యే ఉండాలంటూ పలు హుకుంలు జారీ చేశారు. దీంతో అఫ్గాన్‌ మహిళలు ప్రాణాలకు తెగించి మరీ ఇతర దేశాలకు పారిపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 

తాజాగా తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అఫ్గాన్ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనలేరు. క్రీడల్లో పాల్గొన్నప్పుడు మహిళల శరీర భాగాలు బహిర్గతం అవుతాయన్న కారణంగా క్రీడలపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్లు బుధవారం ప్రకటించారు. మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అఫ్గాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు సహా అనేక మంది మహిళా క్రీడాకారిణుల దేశం విడిచి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కోసం తాలిబన్లు గాలిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు మహిళా విద్యార్థులకు కేవలం మహిళా టీచర్లు మాత్రమే బోధించాలని తాలిబన్లు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే విశ్వవిద్యాలయాలకు హాజరయ్యే మహిళలు తప్పనిసరిగా బుర్ఖాను ధరించాలని, పరదా పద్దతిలోనే వారికి క్లాసులు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలో కొత్త అప్గానిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్లు మంగళవారం ప్రకటించిన విషయం విధితమే.
చదవండి: కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు
 

మరిన్ని వార్తలు