మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్‌ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా

22 Aug, 2021 22:12 IST|Sakshi

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లడంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఈ క్రమంలో ఆ దేశ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిన చాలా అంశాల్లో అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ ముందువరుసలో ఉంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌కు మద్దతుగా నిలిచి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా, తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లతో సమావేశం సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మీ వెంట మేమున్నాం.. చెలరేగి ఆడండి అంటూ క్రికెటర్లను ఉత్సాహపరిచి, మద్దతు ఇచ్చినట్లు సమాచారం.

దీంతో యూఏఈ వేదికగా త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అఫ్గాన్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని ఆ దేశ క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అఫ్గాన్‌ ఆటగాళ్ల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హక్కాని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, 1996-2001 మధ్యలో హక్కాని అధ్యక్షతనే అఫ్గాన్‌లో క్రికెట్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. త్వరలో ఆ దేశంలో పర్యటించాల్సి ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ జట్లు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ క్రికెటర్లు పాకిస్తాన్ పర్యటనలో భద్రతా సమస్యను లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది.
చదవండి: ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్‌ ఏం చేస్తున్నాడు..?

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు