తాలిబన్ల రాజ్యంలో తొలి నియామకం.. అఫ్గాన్‌ క్రికెట్‌ చీఫ్‌గా ఫజ్‌లీ

24 Aug, 2021 16:21 IST|Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తాలిబన్లు మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) చైర్మన్‌గా అజీజుల్లా ఫజ్‌లీకి పట్టం కట్టారు. కొద్ది రోజుల కిందట అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారులతో సమావేశమైన తాలిబన్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడ్డాక చోటు చేసుకున్న అతిపెద్ద నియామకం ఇదే కావడం విశేషం. ఫజ్‌లీ 2018-19లో ఏసీబీ చీఫ్‌గా వ్యవహరించాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌ దారుణ ప్రదర్శన(చివరి స్థానంలో నిలవడంతో) కారణంగా  అతడు పదవి నుంచి వైదొలిగాడు. ఫజ్‌లీ హాయంలో అఫ్గాన్‌ క్రికెట్‌ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందని తాలిబన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే, అఫ్గానిస్తాన్‌ జట్టు వచ్చేనెలలో పాక్‌తో మూడు వన్డేల సిరీ‌స్‌లో తలపడాల్సి ఉండింది. అయితే కారణాలు ప్రకటించకుండా ఈ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా ప్రకటించింది. ఓవైపు క్రికెట్‌కు మద్దతిస్తామని.. క్రికెటర్లు భయపడాల్సిన అవసరం లేదని.. స్వేచ్చగా క్రికెట్‌ ఆడుకోవచ్చని ప్రకటించిన తాలిబన్లు.. ఒక్కరోజు వ్యవధిలోనే కారణాలు వెల్లడించకుండా సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

వాస్తవంగా ఈ సిరీస్‌ శ్రీలంకలో జరగాల్సి ఉండింది. అయితే, కాబూల్‌ నుంచి వాణిజ్య విమానాల రాకపోకలను రద్దు చేయడం, కరోనా కేసులు బాగా పెరగడంతో శ్రీలంకలో 10 రోజుల లాక్‌డౌన్‌ విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరీస్‌ను పాక్‌లో జరపాలని ఏసీబీ తొలుత నిర్ణయించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ సిరీస్‌ వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉండింది.
చదవండి: అరుదైన రికార్డుకు చేరువలో టీమిండియా పేసు గుర్రం..

మరిన్ని వార్తలు