French Open 2021: టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో జిదాన్‌సెక్, బదోస, రిబాకినా

7 Jun, 2021 02:30 IST|Sakshi
సెరెనా, రిబాకినా, బదోస, జిదాన్‌సెక్‌

అద్భుత ఆటతీరుతో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో జిదాన్‌సెక్, బదోస, రిబాకినా

సెరెనా, అజరెంకాలకు చుక్కెదురు

అందరి అంచనాలను తారుమారు చేస్తూ... తమ అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ... తమకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న ప్రత్యర్థులను చిత్తు చేస్తూ... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంతర్జాతీయ టెన్నిస్‌లో అంతగా పేరొందని ముగ్గురు క్రీడాకారిణులు తామర జిదాన్‌సెక్, పౌలా బదోస, ఇలెనా రిబాకినా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఘన విజయాలతో తమ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకోగా... 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా దిగ్గజం సెరెనా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. టైటిల్‌ ఫేవరెట్స్‌గా ఉన్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌), 2019 రన్నరప్‌ మర్కెత వొంద్రుసొవా (చెక్‌ రిపబ్లిక్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమించలేకపోయారు. మరోవైపు ప్రపంచ 85వ ర్యాంకర్‌ తామర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)... ప్రపంచ 35వ ర్యాంకర్‌ పౌలా బదోస (స్పెయిన్‌)... ప్రపంచ 22వ ర్యాంకర్‌ ఇలెనా రిబాకినా (కజకిస్తాన్‌) తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... పదేళ్ల తర్వాత  ప్రపంచ 32వ ర్యాంకర్‌ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.  

మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆదివారం జరిగిన నాలుగు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఇలెనా రిబాకినా 6–3, 7–5తో అమెరికా స్టార్, ఏడో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించగా... పౌలా బదోస 6–4, 3–6, 6–2తో 20వ సీడ్, 2019 రన్నరప్‌ వొంద్రుసొవను ఇంటిముఖం పట్టించింది. తామర జిదాన్‌సెక్‌ 7–6 (7/4), 6–1తో 54వ ర్యాంకర్‌ సొరానా కిర్‌స్టియా (రొమేనియా)పై గెలుపొంది ఏదైనా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మరో మ్యాచ్‌లో 31వ సీడ్‌ పావ్లుచెంకోవా 5–7, 6–3, 6–2తో 15వ సీడ్, రెండుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన అజరెంకాను ఓడించింది. సెరెనాతో 77 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రిబాకినా తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. నెట్‌వద్దకు ఏడుసార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు సాధించింది.  

మెద్వెదేవ్‌ మొదటిసారి...
పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మెద్వెదేవ్‌ (రష్యా) 6–2, 6–1, 7–5తో 22వ సీడ్‌ గారిన్‌ (చిలీ)పై గెలిచి తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 6–3, 6–2, 7–5తో 12వ సీడ్‌ కరెనో బుస్టా (స్పెయిన్‌)పై నెగ్గాడు.   

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట
పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో మార్సెలో అరెవాలో (ఎల్‌సాల్వడార్‌)–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ నుంచి రోహన్‌ బోపన్న (భారత్‌)–స్కుగోర్‌ (క్రొయేషియా) జంటకు వాకోవర్‌ లభించింది. దాంతో బోపన్న జంట  క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

మరిన్ని వార్తలు