SMAT 2021 Winner Tamil Nadu: తమిళనాడు తడాఖా.. మూడోసారి టైటిల్‌ సొంతం

23 Nov, 2021 05:15 IST|Sakshi

మూడోసారి ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నీ టైటిల్‌ సొంతం

ఫైనల్లో కర్ణాటకపై నాలుగు వికెట్లతో విజయం

ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుఖ్‌ ఖాన్‌

Syed Mushtaq Ali Trophy 2021 Final: Tamil Nadu Won Their 3rd Syed Mushtaq Ali Trophy Title: దేశవాళీ టి20 క్రికెట్‌లో తమిళనాడు జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సోమవారం ముగిసిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో తమిళనాడు జట్టు టైటిల్‌ నిలబెట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన తమిళనాడు ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించింది. తద్వారా 2019 ఫైనల్‌ పోరులో కర్ణాటక చేతిలో ఒక పరుగు తేడాతో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో తమిళనాడు ప్రతీకారం తీర్చుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది.

షారుఖ్‌ ఖాన్‌ (15 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సాయికిశోర్‌ (3 బంతుల్లో 6 నాటౌట్‌; 1 ఫోర్‌) తమిళనాడు గెలుపులో కీలకపాత్ర పోషించారు. తమిళనాడు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. కర్ణాటక బౌలర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆఖరి ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. తొలి బంతికి సాయికిశోర్‌ ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాత ప్రతీక్‌ రెండు వైడ్‌లు వేయడంతోపాటు ఐదు పరుగులు ఇచ్చాడు. దాంతో తమిళనాడు విజయసమీకరణం ఆఖరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ప్రతీక్‌ వేసిన ఆఖరి బంతిని షారుఖ్‌ ఖాన్‌ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా సిక్సర్‌గా మలిచి తమిళనాడుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.  

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. ఓపెనర్‌ రోహన్‌ కదమ్‌ ‘డకౌట్‌’ కాగా... మనీశ్‌ పాండే (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో అభినవ్‌ మనోహర్‌ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రవీణ్‌ దూబే (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సుచిత్‌ (7 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో కర్ణాటక స్కోరు 150 పరుగులు దాటింది.

తమిళనాడు బౌలర్లలో సాయికిశోర్‌ (3/12) రాణించాడు. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు ఒకదశలో 17.1 ఓవర్లలో 116 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలుపు కోసం 17 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో షారుఖ్‌  సూపర్‌ ఇన్నింగ్స్‌తో తమ జట్టును గెలిపించాడు.

► ముస్తాక్‌ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెలిచిన జట్టుగా తమిళనాడు గుర్తింపు పొందింది. 2006–07 సీజన్‌లో, 2020– 2021 సీజన్‌లోనూ తమిళనాడు చాంపియన్‌గా నిలిచింది. బరోడా, గుజరాత్, కర్ణాటక జట్లు రెండుసార్లు చొప్పున ముస్తాక్‌ అలీ ట్రోఫీని సాధించాయి.

► గుర్తింపు పొందిన టి20 క్రికెట్‌ టోర్నీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి టైటిల్‌ సాధించిన రెండో జట్టు తమిళనాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన 2018 నిదాహాస్‌ ట్రోఫీ ఫైనల్లో దినేశ్‌ కార్తీక్‌ చివరి బంతికి సిక్స్‌ కొట్టి భారత్‌ను గెలిపించాడు.


 

మరిన్ని వార్తలు