BAN VS IRE 2nd ODI: అరుదైన క్లబ్‌లో చేరిన తమీమ్‌ ఇక్బాల్‌.. తొలి బంగ్లాదేశీగా రికార్డు

20 Mar, 2023 20:39 IST|Sakshi

బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ తన 34వ పుట్టిన రోజున ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు. బంగ్లాదేశ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 40వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సిల్హెట్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తమీమ్‌ ఈ మైలురాయిని అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి రనౌటైన తమీమ్‌ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 15000 పరుగుల మైలురాయిని టచ్‌ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తమీమ్‌.. ఇప్పటికే అత్యధిక సెంచరీలు, అత్యధిక వన్డే పరుగులు, టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీగా రికార్డు, బంగ్లాదేశ్‌ తరఫున 3 ఫార్మట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా పలు రికార్డులు కలిగి ఉన్నాడు.

తమీమ్‌ ఖాతాలో 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 25 సెంచరీలు ఉన్నాయి. మరే బంగ్లాదేశీ క్రికెటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 383 మ్యాచ్‌లు ఆడిన తమీమ్‌ 15009 పరుగులు చేశాడు. తమీమ్‌.. 69 టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 హాఫ్‌ సెంచరీల సాయంతో 5082 పరుగులు, 235 వన్డేల్లో 14 సెంచరీలు, 55 హాఫ్‌ సెంచరీల సాయంతో 8146 పరుగులు, 78 టీ20ల్లో సెంచరీ, 7 హాఫ్‌ సెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు.  

ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో రెండో వన్డేలో ముష్ఫికర్‌ రహీం సునామీ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్‌), లిటన్‌ దాస్‌ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్‌ హ్రిదొయ్‌ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవరల్లో  6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించింది.

బంగ్లాదేశ్‌కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోర్‌. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముష్ఫికర్‌.. వన్డేల్లో బంగ్లాదేశ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు షకీబ్‌ పేరిట ఉండేది. 2009లో షకీబ్‌ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్‌ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్‌ ఇన్నిం‍గ్స్‌ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు