ఒక ఫార్మాట్‌కు గుడ్‌ బై చెబుతా..కానీ

2 Apr, 2021 15:01 IST|Sakshi

ఢాకా:  బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పాలనే యోచనలో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో 78 పరుగులతో ఆకట్టుకోవడం మినహాయించి మిగతా రెండు వన్డేల్లో విఫలమైన తమీమ్‌.. పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. రాబోవు టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే ఒక ఫార్మాట్‌ నుంచి వీడ్కోలు తీసుకోవాలని అనుకుంటున్నాడు. క్రిక్‌బజ్‌తో శుక్రవారం ముచ్చటించిన తమీమ్‌.. ప్రధానంగా రెండు ఫార్మాట్లను ఆడాలని విషయం వెల్లడించాడు.  

‘ ఏ ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పాలి అనేది నాకు తెలుసు. నేను ఇంకా మూడు నుంచి నాలుగేళ్లు క్రికెట్‌ ఆడాలని అనుకున్నట్లయితే మూడు ఫార్మాట్లు ఆడటం సాధ్యం కాదు. అందుచేత ఒకదానికి గుడ్‌ బై చెప్పాలనే అనుకుంటున్నా. నేను 36, 37 ఏళ్ల వయసులో లేను. ట్వంటీ 20 క్రికెట్‌ అనేది నా తొలి ప్రాధాన్యత. నా క్రికెట్‌ కెరీర్‌కు సాన బెట్టుకోవాలంటే మూడు ఫార్మాట్లలో ఒకదానికి విశ్రాంతి ఇవ్వాల్సిందే. ఏ ఫార్మాట్‌ను ముందు వదిలేయాలి. దేన్ని తర్వాత వదిలేయాలి అనే విషయంపై నాకు అవగాహన ఉంది. ప్రస్తుతం దాన్ని రివీల్‌ చేయాలనుకోవడం లేదు’ అని తమీమ్‌ చెప్పుకొచ్చాడు.

తమీమ్‌ మాటల్నిబట్టి టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్డే, టీ20ల్లో బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న తమీమ్‌.. టెస్టు ఫార్మాట్‌లో ఆ దేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడిన తమీమ్‌.. టీ20లకు దూరంగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో మహ్మదుల్లా బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా వ్యహరించాడు.  కాగా, తన కెరీర్‌లో 62 టెస్టుల్లో 4,508 పరుగులు చేసిన తమీమ్‌.. వన్డేల్లో 213 మ్యాచ్‌లు ఆడి 7, 452 పరుగులు సాధించాడు. ఇక 78 టీ20లకు గాను 1,758 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తమీమ్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 23 సెంచరీలు, 85 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు