Tokyo Olympics: కాంస్యాన్ని కోల్పోయిన వారికి బహుమతిగా టాటా కార్లు

13 Aug, 2021 18:02 IST|Sakshi

తమ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత క్రీడాకారులు చరిత్రను సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పతకాల సంఖ్య పెరిగింది. నీరజ్ చోప్రా, మీరాబాయి చాను వంటి చాలా మంది అథ్లెట్లు పతకాలు సాధించగా, తమ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న వారు ఉన్నారు. అయితే, టోక్యో ఒలింపిక్స్ లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత క్రీడాకారులకు టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఓడినా.. మా మనసు గెలుచుకున్నారు అని టాటా ప్రకటించింది.

భారతీయ ఒలింపియన్స్ ను సత్కరించిన రెండవ భారతీయ కార్ల కంపెనీగా టాటా మోటార్స్ నిలిచింది. ఇంతకు ముందు ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు ఎక్స్‌యూవీ 700 ఎడిషన్ కారును మహీంద్రా కంపెనీ బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "ఒలింపిక్స్ అంటే కేవలం పతకాలు మాత్రమే కాదు, మన దేశానికి ఈసారి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లు ఒలింపిక్స్ లో కనబరిచిన కృషిని, స్ఫూర్తిని చూసి మేము సంతోషిస్తున్నాము. ఒత్తిడిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కూడా వారు పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు.. కానీ  వారు తమ అంకితభావంతో లక్షలాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. ఇది భారతదేశంలో రాబోయే వర్ధమాన క్రీడాకారులకు వారు నిజమైన స్ఫూర్తి” అని అన్నారు.

మరిన్ని వార్తలు