Tata Open: మెయిన్‌ ‘డ్రా’కు రామ్‌కుమార్‌

2 Jan, 2023 06:10 IST|Sakshi

నేటి నుంచి టాటా ఓపెన్‌ ఏటీపీ టోర్నీ

పుణే: భారత్‌లో జరిగే ఏకైక అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ)–250 టోర్నీ టాటా ఓపెన్‌లో భారత మూడో ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 432వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 6–3, 7–5తో ప్రపంచ 153వ ర్యాంకర్‌ మతియా బెలూచి (ఇటలీ)పై సంచలన విజయం సాధించాడు. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ ఏకంగా 14 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఏడుసార్లు కాపాడుకున్న రామ్‌కుమార్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు.

మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ప్రపంచ 62వ ర్యాంకర్‌ పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌)తో రామ్‌కుమార్‌ తలపడతాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ మాత్రం మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్‌లో యూకీ 1–6, 4–6తో ఇలియాస్‌ ఈమర్‌ (స్వీడన్‌) చేతిలో ఓడిపోయాడు. నేటి నుంచి మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ‘వైల్డ్‌ కార్డు’ పొందిన భారత టీనేజర్, 15 ఏళ్ల మానస్‌తో మైకేల్‌ మో (అమెరికా); సుమిత్‌ నగాల్‌ (భారత్‌)తో క్రయినోవిచ్‌ (సెర్బియా) తలపడతారు. 6,42,735 డాలర్ల (రూ. 53 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సింగిల్స్‌ విజేతకు 97,760 డాలర్లు (రూ. 80 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి.

మరిన్ని వార్తలు