IND Vs SA 2nd Test: జోహనెస్‌బర్గ్‌లో టీమిండియాకు ప్రత్యేక గుర్తింపు

3 Jan, 2022 19:06 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు వేదికైన జొహనెస్‌బర్గ్‌లో టీమిండియాకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ వేదికపై టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఆరు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఆరుగురు వేర్వేరు కెప్టెన్లతో బరిలో దిగింది.

1992లో తొలిసారి భారత జట్టు ఈ వేదికపై ఆడినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం వహించగా..1997లో సచిన్ టెండూల్కర్, 2006లో రాహుల్ ద్రవిడ్, 2013లో ధోని, 2018లో విరాట్ కోహ్లి కెప్టెన్లుగా వ్యవహరించారు. ప్రస్తుత మ్యాచ్‌లో కోహ్లి అనూహ్యంగా తప్పుకోవడంతో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. తొలి రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు.

పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చిన విహారి(53 బంతుల్లో 20; 3 ఫోర్లు) నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో అశ్విన్‌(21 బంతుల్లో 24; 4 ఫోర్లు), పంత్‌(32 బంతుల్లో 13; ఫోర్‌) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్‌, జన్సెన్‌ తలో రెండు వికెట్లు, రబాడ ఓ వికెట్‌ పడగొట్టారు.
చదవండి: రహానే వికెట్‌తో రికార్డుల్లోకెక్కిన సఫారీ బౌలర్‌

మరిన్ని వార్తలు