Cricket History: మూడేళ్ల కిందట ఇవాల్టి రోజున ఏం జరిగిందంటే..?

15 Jun, 2021 18:23 IST|Sakshi

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో మూడేళ్ల కిందట ఇవాల్టి రోజున మహాద్భుతం జరిగింది. 2018 జూన్ 15న భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో 119 సంవత్సరాల రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో ఒకే రోజులో ఏకంగా 24 వికెట్లు పడ్డాయి. దీంతో ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ రికార్డును 119 సంవత్సరాల తర్వాత టీమిండియా తిరగరాసింది. 

ఈ మ్యాచ్‌లో రహానే నేతృత్వంలోని భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. ఓపెనర్లు మురళీ విజయ్(103), శిఖర్ ధవన్(107) సూపర్‌ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లో ధవన్ పేరిట ఓ అరుదైన రికార్డు నమోదైంది. టెస్ట్‌ క్రికెట్‌లో భోజనానికి ముందే సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా ధవన్‌ రికార్డు నెలకొల్పాడు. వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్ రాహుల్(54), హార్దిక్ పాండ్యా(71) అర్ధశతకాలు సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 154 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం బరిలోకి దిగిన పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడింది. ఆఫ్ఘన్‌ జట్టులో మహ్మద్ నబీ అత్యధికంగా 24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితి రెండో ఇన్నింగ్స్‌లనూ మారలేదు. జడేజా(4), ఉమేశ్‌ యాదవ్‌(3) విజృంభించడంతో ఆఫ్ఘన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్.. ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 
చదవండి: నాటి ప్రపంచ ఛాంపియన్‌.. నేడు ఛాయ్‌ అమ్ముకుంటున్నాడు

మరిన్ని వార్తలు