1983.. ఆ చరిత్రకు 38 ఏళ్లు

25 Jun, 2021 15:56 IST|Sakshi

ఢిల్లీ: క్రికెట్‌ అనే పదం భారతీయుల గుండెల్లోకి మరింత చొచ్చుకుపోయిన రోజు ఇదే. బ్రిటీష్‌ పరిపాలనలోనే మనవాళ్లు క్రికెట్‌ ఆడడం అలవాటు చేసుకున్నా.. టీమిండియా అంటే 1983 ముందు.. ఆ తర్వాత అని చరిత్ర చెప్పుకుంటుంది. అప్పటివరకు క్రికెట్‌లో భారత్‌ అనే పేరు అనామకంగానే ఉండేది. కాగా అప్పటికే క్రికెట్‌లో పాతుకుపోయిన వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్ల ముందు మన ఆటలు సాగేవి కావు. ఒకవేళ వాళ్లు మనం దేశంలో పర్యటించినా.. లేక మనం వాళ్ల దేశంలో పర్యటించిన రిజల్ట్‌ మాత్రం మనకు ప్రతికూలంగానే వచ్చేది.

కానీ 1983 సంవత్సరం క్రికెట్‌లో టీమిండియా ఆటతీరును ప్రపంచానికి పరిచయం చేసింది. ముఖ్యంగా ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణించింది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్‌ చేరింది. కపిల్‌దేవ్‌ సారధ్యంలోని భారత జట్టు ఫైనల్లో బలమైన విండీస్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టంది. భారత్‌లో క్రికెట్‌కు మతం అనే పదానికి భీజం పడింది ఇక్కడే. అప్పటివరకు హాకీని ఇష్టపడినవాళ్లు క్రమంగా క్రికెట్‌కు పెద్ద అభిమానులుగా మారిపోతువచ్చారు. మరి అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఇదే.. జూన్‌ 25, 1983. నేటితో భారత్‌ మొదటి ప్రపంచకప్‌ గెలిచి 38 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆనాటి ఫైనల్‌ విశేషాలను మరోసారి గుర్తుచేసుకుందాం.

ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 54.4 ఓ‍వర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటింగ్‌లో శ్రీకాంత్‌ 38, మోహిందర్‌ అమర్‌నాథ్‌ 26, ఎస్‌ఎమ్‌ పాటిల్‌ 27 పరుగులు చేశారు. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన వెస్టిండీస్‌కు ఇదేం పెద్ద టార్గెట్‌ కాకపోవచ్చని.. మరోసారి కప్పును విండీస్‌ గెలుచుకుంటుందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగానే విండీస్‌ ఇన్నింగ్స్‌ సాగింది. తొలి వికెట్‌ను ఐదు పరుగులకే కోల్పోయినా.. 50/1తో పటిష్టంగా కనిపించింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. భయంకరమైన ఫామ్‌లో ఉన్న వివ్‌ రిచర్డ్స్‌ 33 పరుగుల వద్ద మదన్‌లాల్‌ బౌలింగ్‌లో కపిల్‌దేవ్‌ తీసుకున్న సూపర్‌ క్యాచ్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పింది.

ఆ తర్వాత భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులు విసురుతూ చెమటలు పట్టించగా.. విండీస్‌ 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్‌ అయి 43 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొహిందర్‌ అమర్‌నాథ్‌, మదన్‌లాల్‌ ద్వయం చెరో మూడు వికెట్లతో చెలరేగారు.అలా తొలిసారి కపిల్‌ సారధ్యంలోని టీమిండియా జగజ్జేతగా అవతరించింది. అంతకముందు లీగ్‌ దశలో జింబాబ్వేపై కపిల్‌ దేవ్‌ ఆడిన 175* పరుగుల చారిత్రక ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోలేరు. సెమీస్‌ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో కపిల్‌ పెయిన్‌ కిల్లర్స్‌ ఇంజక్షన్‌ తీసుకొని బరిలోకి దిగడం.. 175 నాకౌట్‌ ఇన్నింగ్స్‌ ఆడడం చరిత్రలో మిగిలిపోయింది.  ఆ తర్వాత మళ్లీ సరిగ్గా 28 ఏళ్లకు 2011లో ధోని సారధ్యంలో టీమిండియా రెండో ప్రపం‍చకప్‌ను సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: PSL-​‍6 Final: విజేత ముల్తాన్‌ సుల్తాన్స్‌

సిక్స్‌ కొట్టి తలపట్టుకున్నాడు.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు