ఆస్ట్రేలియాకు అన్ని అస్త్రాలతో...

14 Sep, 2022 04:17 IST|Sakshi

ప్రపంచకప్‌ కోసం స్పష్టమైన వ్యూహం

లోపాలు లేని జట్టుతో టీమిండియా  

సాక్షి క్రీడా విభాగం
గత ఏడాది కాలంగా టి20 క్రికెట్‌లో భారత తుది జట్టు ఎంపిక, ప్రయోగాలు చూస్తే వరల్డ్‌కప్‌ టీమ్‌ ఎలా ఉండనుందనే అంచనా వచ్చేస్తుంది. 2021 ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత టీమ్‌ ఆలోచనాధోరణిలో మార్పు తెచ్చే ప్రయత్నం జరిగింది. గెలిచినా, ఓడినా ప్రయోగాలు చేయడం ఖాయమని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పష్టంగా చెప్పాడు. గత వరల్డ్‌కప్‌ తర్వాత టీమిండియా 29 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో 22 గెలిచి, 6 మాత్రమే ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు.

ఇందులో న్యూజిలాండ్, వెస్టిండీస్‌ (2 సార్లు), ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై సిరీస్‌ విజయాలు ఉన్నాయి. ఆసియా కప్‌లో అనూహ్యంగా ఫైనల్‌ చేరడంలో జట్టు విఫలమైంది. ఈ అన్ని సిరీస్‌లను చూస్తే కీలక ఆటగాళ్ల విశ్రాంతితో పాటు వరల్డ్‌కప్‌ కోసం ఒక ప్రయత్నం చేసినట్లుగా యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం కూడా స్పష్టంగా కనిపించింది. దాని ప్రకారమే జట్టు ఎంపిక జరిగింది.  

అందుకే హుడా!
జట్టులో దీపక్‌ హుడా ఎంపికపై కొంత చర్చ జరుగుతోంది. అయితే శ్రేయస్‌ అయ్యర్‌తో పోలిస్తే బౌలింగ్‌ కూడా చేయగల నైపుణ్యం ఉండటం హుడా అవకాశాలను పెంచింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా గాయంతో దూరం కావడంతో హుడాకు ప్రాధాన్యత లభించింది. జడేజా తరహాలోనే లెఫ్టార్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నా... హుడా మెరుగైన బ్యాటింగ్‌కే మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యత ఇవ్వడం ఆసియా కప్‌లో కనిపించింది.

గత కొంత కాలంగా ‘ఫినిషర్‌’ అంటూ ప్రోత్సహిస్తూ వచ్చిన దినేశ్‌ కార్తీక్‌కు సహజంగానే టీమ్‌లో చోటు లభించింది. ఐపీఎల్‌ స్థాయిలో అద్భుతాలు చేయకపోయినా, తనకు అవకాశం ఇచ్చిన ప్రతీసారి కార్తీక్‌ తన విలువను చూపించగలిగాడు. తరోబాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో భారత్‌ స్కోరు 127/5గా ఉంటే... 19 బంతుల్లో 41 పరుగులు చేసి కార్తీక్‌ స్కోరును 190 పరుగులకు చేర్చడం అతని పాత్ర ఏమిటో స్పష్టంగా చూపించింది.

మరో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. నిజానికి అతని ప్రదర్శన గొప్పగా ఉండటం లేదు కానీ రోహిత్‌ దీనిపై వివరణ ఇచ్చాడు. టాప్‌–6లో ఒక్క ఎడంచేతి వాటం బ్యాటర్‌ కూడా లేకపోవడం వల్ల పంత్‌కు అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడూ టీమ్‌లో అలాంటి బ్యాటర్‌ అవసరం ఉంది కాబట్టి పంత్‌ను కాదనలేని పరిస్థితి.  

షమీ వస్తాడా! 
ప్రస్తుతానికి వరల్డ్‌కప్‌ స్టాండ్‌బైగానే మొహమ్మద్‌ షమీ ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఆడించి బీసీసీఐ అతని తాజా ఆటను పరిశీలించాలని భావిస్తోంది. గత వరల్డ్‌కప్‌ తర్వాత ఒక్క టి20 మ్యాచ్‌ ఆడకపోయినా అనుభవంతో పాటు పదునైన పేస్‌ కారణంగా షమీ వైపు సెలక్టర్లు చూశారు. అందుబాటులో ఉన్న పేసర్లలో ఉమ్రాన్, అవేశ్‌ ఖాన్‌ విఫలం కాగా, ప్రసిధ్‌ కృష్ణ గాయపడ్డాడు. భువనేశ్వర్, హర్షల్‌ పటేల్‌ దాదాపు ఒకే తరహా బౌలర్లు కాగా, ఆసీస్‌ గడ్డపై బౌన్స్‌పై రాణించే ‘హిట్‌ ద డెక్‌’ తరహా ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం జట్టుకు ఉంది.

దాంతో మళ్లీ చూపు షమీపై పడింది. జట్టులో మార్పులు చేసేందుకు అక్టోబర్‌ 23 వరకు సమయం ఉండటంతో ఏదైనా జరగొచ్చు. అశ్విన్‌ ఎంపికపై కూడా సందేహాలు మొదలయ్యాయి. అయితే వరల్డ్‌కప్‌లాంటి ఈవెంట్‌లో అనుభవం ఏ దశలోనైనా పనికొస్తుంది. రవి బిష్ణోయ్‌తో పోలిస్తే అదే అశ్విన్‌కు అనుకూలించింది. పైగా ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్‌ హ్యాండర్లు ఎక్కువగా ఉంటే ఆఫ్‌స్టంప్‌ నుంచి బయటకు వెళ్లే అశ్విన్‌ బంతి ప్రమాదకారి కాగలదు. ఈ నేపథ్యంలో అతనికి మరో వరల్డ్‌కప్‌ అవకాశం వచ్చింది. మిగతా ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎలాంటి చర్చకు తావు లేని చోట ఈ జట్టు ప్రపంచకప్‌లో సత్తా చాటగలదని ఆశించవచ్చు.   

2007లో తొలి టి20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్‌కప్‌ టైటిల్‌ను అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆరు మెగా టోర్నీలు జరిగినా టీమిండియాకు కలిసి రాలేదు. మొదటి ప్రపంచకప్‌ తర్వాతే ఐపీఎల్‌ వచ్చి అద్భుతాలు చేసినా, మెరుపులాంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చినా విశ్వ వేదికపై మాత్రం భారత్‌కు మళ్లీ ట్రోఫీ దక్కలేదు. 2021 టోర్నీలో సెమీస్‌ కూడా చేరడంలో విఫలమైన భారత బృందం ఏడాది లోపే కొత్త కెప్టెన్‌ నాయకత్వంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టి20 ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించిన జట్టు ఎంపిక ఏ రకంగా ఉంది? ఈ బృందం అభిమానుల ఆశలు, అంచనాలు నిలబెట్టగలదా!   

మరిన్ని వార్తలు