Shardul Thakur: ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఆల్‌రౌండర్‌

17 Dec, 2022 17:52 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్కనున్నాడు.ఎంట్ర‌ప్రెన్యూర్ అయిన మితాలీ పారుల్క‌ర్‌ను ఫిబ్ర‌వ‌రిలో వివాహం చేసుకోనున్నాడు. గతేడాది నవంబర్‌లో ఈ జంటకు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అప్పటినుంచి శార్దూల్‌ క్రికెట్‌లో బిజీగా ఉండడంతో సమయం కుదరలేదు. ముంబై స‌మీపంలోని క‌ర్జ‌త్ ప్రాంతంలో వీరిద్దరి వివాహం జ‌ర‌గ‌నుంది. మ‌హారాష్ట్ర సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో ఈ జంట‌ పెళ్లి చేసుకోనుంది. వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన మొద‌లు అవుతాయి. 

కాగా శార్దూల్‌తో పెళ్లిపై స్వయంగా పెళ్లి కూతురు మితాలీ స్పందించింది. ''శార్ధూల్ క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు అత‌నికి మ్యాచ్‌లు ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 25న మాతో క‌లుస్తాడు. మా పెళ్లికి దాదాపు 200 నుంచి 250 మంది అతిథులు వ‌స్తార‌ని అనుకుంటున్నాం. మేము మొద‌టగా గోవాలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నాం. అయితే, బంధువులు, స్నేహితులు ఎక్కువ మంది ఉండ‌డంతో అంద‌రినీ గోవా తీసుకెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని ఆ నిర్ణ‌యం వాయిదా వేశాం '' అని చెప్పుకొచ్చింది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో శార్దూల్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతడిని కోల్‌క‌తా కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో రూ. 10.75 కోట్ల‌కు శార్ధూల్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ ద‌క్కించుకుంది. అయితే అత‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దాంతో ట్రేడింగ్ ప‌ద్ధతిలో కోల్‌క‌తాకు అమ్మేసింది.


 

మరిన్ని వార్తలు