ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్‌ సుందర్‌ గురించిన ఆసక్తికర విషయాలు

29 Jan, 2023 18:50 IST|Sakshi

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్‌ యంగ్‌ క్రికెటర్‌.. 2021 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆ సిరీస్‌లోని బ్రిస్బేన్‌ టెస్ట్‌లో నాటకీయ పరిణామాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సుందర్‌.. సంచలన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ఆ మ్యాచ్‌లో సుందర్‌ చేసిన హాఫ్‌ సెంచరీ.. ఆ మ్యాచ్‌లో సుందర్‌ తీసిన స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసాయి.

తాజాగా న్యూజిలాండ్‌ సిరీస్‌-2023లో భాగంగా జరిగిన తొలి టీ20లో బౌలింగ్‌లో 2 వికెట్లు, బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న సుందర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సుందర్‌.. అబ్బురపడే ప్రదర్శనతో రాణించినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అయినప్పటికీ ఈ యువ ఆల్‌రౌండర్‌ అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌ తర్వాత సుందర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అదేంటంటే.. సుందర్‌ కేవలం​ ఒక్క చెవితో మాత్రమే వినగలడట. ఈ విషయాన్ని సుందరే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బహిర్గతం చేశాడు. వినికిడి లోపం ఉన్నప్పటికీ.. ఏమాత్రం కుంగిపోని ఈ యువ కెరటం, సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

సుందర్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వాషింగ్టన్‌ సుందర్‌ పేరు వినగానే, అతను క్రిస్టియన్‌  ఏమోనని అందరూ అనుకుంటారు. అయితే అతను సంప్రదాయ తమిళ హిందు కుటుంబానికి చెందిన వాడని సుందర్‌ తండ్రి వివరణ ఇచ్చాడు. మరి సుందర్‌కు వాషింగ్టన్‌ పేరును ఎందుకు జోడించాల్సి వచ్చిందన్న విషయంపై అతని తండ్రి ఓ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. సుందర్‌ చిన్నతనంలో కుటుంబం ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు పీడీ వాషింగ్టన్‌ అనే ఓ సైనికుడు తమను అన్ని విధాల ఆదుకున్నాడని, ఆ కృతజ్ఞతతోనే తమ అబ్బాయికి వాషింగ్టన్‌ పేరును జోడించానని సుందర్‌ తండ్రి వివరణ ఇచ్చాడు. 

మరిన్ని వార్తలు