Happy Birthday Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ గురించి మనకు తెలియని విశేషాలు

12 Dec, 2021 11:48 IST|Sakshi

''జీవితంలో ఎలా పోరాడాలనేది క్రికెట్‌ నాకు నేర్పింది.. అందుకే లైఫ్‌లో ఎప్పుడు విశ్వాసం కోల్పోలేదు.. క్రికెట్టే జీవితంలో పోరాడడం.. పడడం.. లేవడం.. ముందుకు సాగడం లాంటివి నేర్పించింది.. నా శ్వాస ఉన్నంతవరకు ఆటకు ఏదో రూపంలో సాయం అందిస్తూనే ఉంటాను''..  భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సందర్భంగా భావోద్వేగంతో పలికిన మాటలు ఇవి.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

డిసెంబర్‌ 12.. ఈ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా యువరాజ్‌ సింగ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ అతని జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలను తెలుసుకుందాం. 19 ఏళ్ల కెరీర్‌ ప్రస్థానంలో పోరాటాలే ఎక్కువగా చూసిన యువరాజ్‌ సింగ్‌ జీవితం అందరికి ఆదర్శ ప్రాయం. ఈ తరానికి యువరాజ్‌ అంటే గుర్తుకు వచ్చేది.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ క్రికెటర్‌.. మంచి ఆల్‌రౌండర్‌గా అని మాత్రమే. ఇదంతా యువరాజ్‌ జీవితంలో ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే యువీ జీవితంలో మనకు తెలియని సంఘటనలు చాలానే ఉన్నాయి. తాను చిన్నతనం నుంచి అనుభవించిన మానసిక సంఘర్షణ.. తండ్రి బలవంతంతో తనకు ఇష్టమైన ఆటను వదిలేయడం.. అస్సలు ఇష్టం లేని క్రికెట్‌లో అద్భుతాలు చేయడం.. ఆ తర్వాత క్యాన్సర్‌ మహమ్మరిన పడడం.. దానితో పోరాడి జీవితంలో మళ్లీ ఎదగడం లాంటివి కనిపిస్తాయి. 

క్రికెట్‌ అంటే అస్సలు ఇష్టం లేదు
యువరాజ్‌ సింగ్‌ జన్మించింది క్రికెట్‌ కుటుంబంలోనే. తన తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ అప్పటికే టీమిండియాలో ఫాస్ట్‌ బౌలర్‌గా ఉన్నాడు. యువీ చిన్నతనంలోనే తల్లిదండ్రులకు విబేధాలు వచ్చి విడిపోయారు. దీంతో తండ్రికి దూరంగా.. తల్లి షబ్నం సింగ్‌ నీడలో ఎంతో గారబంగా పెరిగాడు. అప్పుడే టెన్నిస్‌, స్కేటింగ్‌ మీద యువరాజ్‌ ఇష్టం పెంచుకున్నాడు. ముఖ్యంగా స్కేటింగ్‌లో అండర్‌ 14 విభాగంలో నేషనల్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌  అందుకున్నాడు. పదేళ్ల వయసు వరకు యువరాజ్‌ చదువుతో పాటు టెన్నిస్‌, స్కేటింగ్‌తోనే ఎ‍క్కువ కాలం గడిపాడు. అయితే తల్లి షబ్నంకు, తండ్రి యోగరాజ్‌కు విబేధాలు సమసిపోవడంతో యువీ జీవితం మలుపు తిరిగింది.

తాను క్రికెటర్‌గా ఉన్నప్పుడు కొడుకు టెన్నిస్‌, స్కేటింగ్‌ లాంటి గేమ్‌ ఎలా ఆడతాడని.. యువరాజ్‌ను కూడా క్రికెట్‌లోకి తీసుకురావాలని యోగ్‌రాజ్‌ భావించాడు. అప్పటికి యువీకి క్రికెట్‌ అంటే అస్సలు ఇష్టం లేదు. ఒకరోజు యువీని దగ్గరికి పిలిచిన తండ్రి యోగరాజ్‌.. స్కేటింగ్‌లో అతను సాధించిన మెడల్‌ను కిందపడేసి ఇకమీదట స్కేటింగ్‌ ఆడేందుకు వీలు లేదని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో తండ్రి మాటను కాదనలేక బలవంతంగానే క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మొదట్లో యువరాజ్‌ను బౌలర్‌గా చూద్దామని భావించిన యోగ్‌రాజ్‌ ఉదయాన్నే తనతో పాటు గ్రౌండ్‌కు తీసుకెళ్లి బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయించేవాడు. కానీ యువరాజ్‌ మాత్రం బ్యాటింగ్‌ చేయడానికే ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో వికెట్లను విరగొట్టడం నేర్చుకొని ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. తన బలవంతం మీద క్రికెట్‌లోకి వచ్చాడని అర్థం చేసుకున్న యోగరాజ్‌ ఆ దిశగానే ప్రోత్సహించాడు.

అంతే అక్కడినుంచి యువరాజ్‌ క్రికెట్‌ కెరీర్‌ మరో మలుపు తీసుకుంది. 13 ఏళ్ల 11 నెలల సమయంలో  అండర్‌-16 విభాగంలో పంజాబ్‌ తరపున ఆడాడు. ఆ తర్వాత అ1996లో పంజాబ్‌ తరపున అండర్‌-19కి సెలక్టయ్యాడు. ఇక్కడే యువరాజ్‌ తొలిసారి సెంచరీ సాధించి పెద్ద ప్లేయర్ల దృష్టిలో పడ్డాడు. రంజీల్లో ఎదురులేకుండా దూసుకెళ్లిన యువరాజ్‌కు 2000 అండర్‌ 19 ప్రపంచకప్‌ టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. మహ్మద్‌ కైఫ్‌ కెప్టెన్సీలో టీమిండియా తరపున బరిలోకి దిగిన యువీ మెరుపులు మెరిపించాడు. ఇక్కడే తొలిసారి సెలక్టర్ల దృష్టిలో పడిన యువరాజ్‌ 2000 ఐసీసీ నాకౌట్‌ ట్రోఫీ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.  అలా మొదలైన యువీ ప్రస్థానం 19 ఏళ్ల పాటు సాగింది.

19 ఏళ్ల కెరీర్‌ ప్రస్థానం
తన 19 ఏ‍ళ్ల కెరీర్‌లో యువరాజ్‌ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇ‍క 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లు ఆడిన యువరాజ్‌సింగ్‌ ఆల్‌రౌండర్‌గా అత్యధిక ఫైనల్స్‌ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. తన కెరీర్‌లో ఆరు ఇంటర్నేషనల్‌ ఫైనల్స్‌(2002 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, 2003 వన్డే వరల్డ్‌కప్‌, 2007 టి20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2014 టి20 ప్రపంచకప్‌, 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌) ఆడాడు. ఇందులో టీమిండియా మూడుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో యువరాజ్‌ సభ్యుడిగా ఉన్నాడు. దీనిలో మొదటిది 2000 అండర్‌-19 ప్రపంచకప్‌.. ఇక మిగతా రెండు 2007 టి20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌.

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
ఇక 2007 టి20 ప్రపంచకప్‌ టీమిండియా గెలవడం ఒక ఎత్తు అయితే.. యువరాజ్‌ ఇంగ్లండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం మరొక ఎత్తు. నిజానికి కోపానికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే యువరాజ్‌ను గెలికితే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కవ్వింపు చర్యలతో ఆగ్రహంతో ఊగిపోయిన యువరాజ్‌ తన కోపాన్ని స్టువర్ట్‌ బ్రాడ్‌పై చూపించాడు. పూనకం వచ్చిందా అన్నట్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది కేవలం 12 బంతుల్లోఏ హాఫ్‌ సెంచరీ సాధించిన యువీ ఓవరాల్‌గా 14 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. క్రికెట్‌ బతికున్నంతకాలం యువరాజ్‌ అంటే గుర్తుకువచ్చేది మొదట ఈ ఆరు సిక్సర్లే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

2011 వన్డే వరల్డ్‌కప్‌.. గోల్డెన్‌ డేస్‌
2011 వన్డే ప్రపంచకప్‌ యువరాజ్‌ కెరీర్‌లో గోల్డెన్‌ డేస్‌ అని చెప్పొచ్చు. 28 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్‌ గెలవడంలో యువరాజ్‌ సింగ్‌ పాత్ర మరువలేనిది. ఆ ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా యువరాజ్‌ దుమ్మురేపాడు. ఆ టోర్నీలో బ్యాటింగ్‌లో 362 పరుగులు.. బౌలింగ్‌లోనూ 15 వికెట్లు తీసి ఏకంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును కొల్లగొట్టాడు. అంతేకాదు ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో హాఫ్‌ సెంచరీ కొట్టిన ఆటగాడిగానూ.. ఆల్‌రౌండర్‌గానూ యువీ రికార్డులకెక్కాడు.

క్యాన్సర్‌ మహమ్మారి.. గడ్డురోజులు
ఇక గోల్డెన్‌ డేస్‌ చూసే ప్రతీ ఆటగాడికి గడ్డురోజులు రావడం సహజమే. అలాంటి పరిస్థితిని యువరాజ్‌ 2011 వన్డే ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే చూడాల్సి వచ్చింది. నిజానికి వన్డే ప్రపంచకప్‌ జరుగుతున్న సమయంలోనే యువరాజ్‌ క్యాన్సర్‌ మహమ్మారికి గురయ్యాడు. ఒక మ్యాచ్‌లో గ్రౌండ్‌లోనూ రక్తం కక్కుకోవడం సగటు అభిమానిని ఆందోళనకు గురిచేసింది. అయినప్పటికి బాధను ఓర్చుకొని టీమిండియా 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రపంచకప్‌ ముగిసిన నాలుగు నెలల్లోనే ఒక రష్యన్‌ డాక్టర్‌ యువరాజ్‌ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అమెరికా వెళ్లిన యువీ అక్కడ మూడు దశల్లో కీమోథెరపీ చేయించుకున్నాడు. 2012 మార్చిలో కోలుకున్న యువరాజ్‌ భారత్‌కు తిరిగొచ్చాడు. మళ్లీ భారత జట్టులోకి అడుగుపెట్టాలనే దృడ సంకల్పంతో ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టాడు.

2012 ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో మ్యాచ్‌ ద్వారా కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. అయితే అప్పటినుంచే యువీ బ్యాటింగ్‌లో ముందున్న పదును క్రమంగా తగ్గడం ప్రారంభమయింది. ఇక అప్పటినుంచి యువరాజ్‌ కెరీర్‌ ఒడిదుడుకులకు లోనైంది. వయసు కూడా పెరుగుతుండడం.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు వస్తుండడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అడపా దడపా మెరుపులు మెరిపించినప్పటికి యువరాజ్‌ గాడిన పడలేకపోయాడు. ఇక టీమిండియా తరపున యువరాజ్‌ చివరి మ్యాచ్‌ను 2017 జూన్‌ 30న ఆడాడు. అప్పటినుంచి రెండు సంవత్సరాల పాటు ఆటకు దూరంగా ఉన్న యువరాజ్‌ జూన్‌ 10, 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక చావును జయించిన తన ప్రయత్నాలను.. తిరిగి క్రికెట్‌లో అడుగుపెట్టడానికి తాను చేసిన పోరాటాన్ని.. జీవితంలోని తన అనుభవాలన్నింటిని ఒక దగ్గర చేరుస్తూ ''ది టెస్ట్‌ ఆఫ్‌ మై లైఫ్‌'' పేరుతో పుస్తకాన్ని రాశాడు.

ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర
తన హిట్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యువరాజ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లోనూ తనదైన ముద్ర చూపించాడు. 2014లో రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు యువీని రూ.14 కోట్లు పెట్టి కొనడం ఒక సంచలనం. ఆ తర్వాత 2015 ఐపీఎల్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే  అత్యధిక ధర(రూ.16 కోట్లు) సొంతం చేసుకోవడం యువరాజ్‌కున్న విలువేంటో చూపించింది.  అయితే ఇటీవలే యువరాజ్‌ తాను మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నానంటూ తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. వచ్చే ఫిబ్రవరి నుంచి తాను బరిలోకి దిగనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం విన్నప్పటి నుంచి యువరాజ్‌ అభిమానులే కాదు.. సగటు క్రికెట్‌ అభిమాని కూడా అతని రాకకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

మరిన్ని వార్తలు