ఆసియా కప్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానుల ఆక్రోశం

7 Sep, 2022 15:54 IST|Sakshi

ఆసియా కప్‌ 2022లో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌-4 దశలో తొలుత పాక్‌ చేతిలో, తాజాగా శ్రీలంక చేతిలో ఎదురైన ఘోర పరాభవాలను జీర్ణించుకోలేని అభిమానులు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్‌ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం ఐపీఎలేనని విరుచుకుపడుతున్నారు. దేశం కోసం మ్యాచ్‌లు గెలవాలన్న కసి టీమిండియాలో కొరడిందని, జాతికి ప్రాతినిధ్యం వహించేప్పుడు భారీ అంచనాలు పెట్టుకుంటే ఇలాగేనా ఆడేదని ఏకి పారేస్తున్నారు. 

వెళ్లి ఐపీఎల్‌ ఆడి డబ్బు కూడబెట్టుకోండి.. భారత్‌ గెలిచినా, ఓడినా మీకు పట్టదు అంటూ ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చి టీమిండియా ఓటముల్లో కీలక పాత్రధారిగా మారిన రిషబ్‌ పంత్‌ను ఎగాదిగా వాయించేస్తున్నారు. పంత్‌కు సీరియస్‌నెస్‌ అనేదే లేదని, దేశం కోసం ఆడుతున్నాడన్న ధ్యాసే లేదని, ఇతర విషయాలపై ఉన్న శ్రద్ధ క్రికెట్‌పై లేదని మండిపడుతున్నారు. మొత్తంగా భారత క్రికెటర్లు ఇలా తయారవ్వడానికి ఐపీఎలే కారణమని, బీసీసీఐ ఇకనైనా మేల్కొని ఐపీఎల్‌కు అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు భారత క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడటమే మానేస్తారని హెచ్చరిస్తున్నారు. 

ఏడాదికి ఓసారి ఐపీఎల్‌ నిర్వహిస్తుంటేనే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేప్పుడు భారత ఆటగాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఏడాదికి రెండు ఐపీఎల్‌లు నిర్వహిస్తే అంతే సంగతులని కామెంట్లు పెడుతున్నారు. జనాలు ఐపీఎల్‌ చూడటం మానేసినప్పుడే.. భారత ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని అంటున్నారు. ఇలాగే వదిలేస్తే ఆటగాళ్లు జాతీయ జట్టు ప్రయోజనాలు గాలికొదిలేసి, క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మాయలో కెరీర్‌లు నాశనం చేసుకుంటారని బల్ల గుద్ది చెబుతున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లోనూ భారత ఆటగాళ్ల తీరు మారకుంటే జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసి, ఐపీఎల్‌ ఆడని ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు.  

 
చదవండి: అర్షదీప్‌పై దూషణకు దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. ఉతికి ఆరేసిన జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు