టీమిండియాలో కొనసాగాలంటే ఆల్‌రౌండర్లుగా తయారవ్వండి.. లేదంటే.. సీనియర్ల ఫ్యాన్స్‌ వార్నింగ్‌..!

21 Nov, 2022 16:45 IST|Sakshi

ఈ శతాబ్దం ఆరంభం భారత క్రికెట్‌కు స్వర్ణయుగం లాంటిది. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో సీనియర్లు సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అనిల్‌ కుంబ్లే, జహీర్‌ ఖాన్‌ తదితరులతో జట్టు కళకళలాడేది. గంగూలీ హయాంలో ఆట కొత్త పుంతలు తొక్కి అగ్రశ్రేణి జట్లన్నింటి​కీ చుక్కలు చూపించేది. నాటి భారత జట్టు విజయాల వెనుక ఎవరో ఒక్కరు మాత్రమే ఉండేవారు కాదు. జట్టు మొత్తం సమిష్టిగా రాణించేది.

ముఖ్యంగా సీనియర్లంతా తమకు సాధ్యమైనంతవరకు డ్యుయల్‌ రోల్‌ పోషించేవారు. బ్యాటర్లైతే బ్యాటింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బౌలింగ్‌ కూడా చేసి రాణించేవారు. బౌలర్లు కూడా చాలా సందర్భాల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. నేటి టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అయితే రోజంతా బ్యాటింగ్‌ చేసి తిరిగి వికెట్‌కీపింగ్‌ చేసేవాడు.

సచిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌ లాంటి స్పెషలిస్ట్‌ బ్యాటర్లు వన్డేల్లో పదలు సంఖ్యలో ఓవర్లు వేసి జట్టును గెలిపించిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్‌ల్లో అయితే ఈ ముగ్గురు 30, 40 ఓవర్లు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బౌలర్ల విషయానికొస్తే.. కుంబ్లే, హర్భజన్‌ లాంటి స్పెషలిస్ట్‌ బౌలర్లు టెస్ట్‌ల్లో శతకాలు బాది మేము సైతం అంటూ జట్టుకు భరోసా ఇచ్చేవారు. అప్పుడప్పుడే వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడంతో పాటు నాణ్యమైన స్పిన్నర్‌గానూ సేవలిందించాడు. అజిత్‌ అగార్కర్‌, హర్భజన్‌ సింగ్‌లు చాలా సందర్భాల్లో బ్యాట్‌ను ఝులిపించి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడేవారు. ఇలా జట్టులో దాదాపు ప్రతి ఒక్కరు ద్విపాత్రాభినయం (ఆల్‌రౌండర్‌) చేయడంతో నాడు టీమిండియా ఎన్నో అపురూపు విజయాలు సాధించింది.

ఇక, ప్రస్తుత టీమిండియా విషయానికొస్తే నాటి పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంది. జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్ల కొరత ఉంది. అడపాదపడా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు దొరుకుతున్నారు కానీ,​ 130 కోట్ల మంది భారతీయుల్లో నాణ్యమైన ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మాత్రం దొరకట్లేదు. హార్ధిక్‌ పాండ్యా రూపంలో ఏదో ఒక ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దొరికాడని అనుకునే లోపే అతను గాయాల బారిన పడతాడు.

స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా చెప్పుకునే వారైతే టీ20ల్లో పట్టుమని 4 ఓవర్లు కూడా వేయలేకపోతున్నారు. సిక్స్‌ ప్యాక్‌ బాడీలతో, యోయో టెస్ట్‌ల్లో (ఫిట్‌నెస్‌) ఇరగదీసే వీరు 20 ఓవర్ల పాటు మైదానంలో నిలబడలేకపోతున్నారు. గతంలో (టెస్ట్‌ల్లో) బౌలర్లు వందల ఓవర్లు, బ్యాటర్లు రోజుల తరబడి క్రీజ్‌లో ఉండేవారు. నేటితో పోలిస్తే వారి దేహదారుడ్యం కూడా అంతంతమాత్రంగానే ఉండేది. అయినా వారు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తూ జట్టుకు సేవలందించేవాళ్లు.

నిన్న (నవంబర్‌ 20) న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో స్సిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన దీపక్‌ హుడా బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి సత్తా చాటడంతో భారత క్రికెట్‌ అభిమానులు ఈ శతాబ్దం ఆరంభంలోని టీమిండియాను గుర్తు చేసుకుంటున్నారు. సచిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌లు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనే రాణించేవారని పాత విషయాలను నెమరు వేసుకుంటున్నారు.

ప్రస్తుత టీమిండియా స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు కూడా వారిలానే ఆల్‌రౌండర్‌ పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. ఆటలో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కేవలం బ్యాటింగ్‌ మాత్రమే చేస్తామంటే కుదరదని రోహిత్‌, కోహ్లిలకు వార్నింగ్‌ ఇస్తున్నారు. అప్పట్లోలా ఇప్పుడు పదుల సంఖ్యలో ఓవర్లు వేయాల్సిన అవసరం కూడా లేదని, టీ20ల్లో మహా అయితే 2 నుంచి 3 ఓవర్లు, వన్డేల్లో అయితే 4 నుంచి 6 ఓవర్లు వేయగలిగితే చాలని అంటున్నారు.

ఇప్పటికైనా టీమిండియాలోని సీనియర్లు మేల్కొని ఆల్‌రౌండర్లుగా మారకపోతే ఎంతటి ఆటగాడినైనా జట్టు నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బౌలర్లు కూడా తాము బౌలింగ్‌ మాత్రమే చేస్తామంటే కుదరదని, కనీసం 40, 50 పరుగులు చేసేలా సిద్ధపడాలని హెచ్చరిస్తున్నారు.    

సచిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌ల గణాంఆకలు.. 

  • సౌరవ్‌ గంగూలీ 113 టెస్ట్‌ల్లో 42.2 సగటున 16 సెంచరీలు 35 హాఫ్‌ సెంచరీల సాయంతో 7212 పరుగులు 32 వికెట్లు  
  • 311 వన్డేల్లో 41 సగటున 22 సెంచరీలు 72 హాఫ్‌ సెంచరీల సాయంతో 11363 పరుగులు 100 వికెట్లు
  • సచిన్‌ టెండూల్కర్‌ 200 టెస్ట్‌ల్లో 53.8 సగటున 51 సెంచరీలు 68 హాఫ్‌ సెంచరీల సాయంతో 15921 పరుగులు 46 వికెట్లు
  • 463 వన్డేల్లో 44.8 సగటున 49 సెంచరీలు 96 హాఫ్‌ సెంచరీల సాయంతో 18426 పరుగులు 154 వికెట్లు
  • వీరేంద్ర సెహ్వాగ్‌ 104 టెస్ట్‌ల్లో 49.3 సగటున 23 సెంచరీలు 32 హాఫ్‌ సెంచరీల సాయంతో 8586 పరుగులు 40 వికెట్లు
  • 251 వన్డేల్లో 35 సగటున 15 సెంచరీలు 38 హాఫ్‌ సెంచరీల సాయంతో 8273 పరుగులు 96 వికెట్లు


 

మరిన్ని వార్తలు