Sikandar Raza: పాక్‌ మూలాలున్న బ్యాటర్‌.. అయినా సరే మనసు దోచుకున్నాడు

23 Aug, 2022 08:01 IST|Sakshi

జింబాబ్వే స్టార్‌.. సికందర్‌ రజా ఇప్పుడు నయా సంచలనం. జట్టులో ఎవరు ఆడినా.. ఆడకపోయినా తాను మాత్రం చెలరేగుతూనే ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో వరుస శతకాలతో అలరించిన రజా.. టీమిండియాతో మాత్రం అదే ఫామ్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాడని మాట్లాడుకునేలోపే స్టన్నింగ్స్‌ సెంచరీతో మెరిశాడు. టీమిండియాపై జింబాబ్వే మ్యాచ్‌ ఓడినా.. సికందర్‌ రజా మాత్రం అభిమానుల మనసు దోచుకున్నాడు. పాక్‌ మూలాలున్న బ్యాటర్‌ అయినప్పటికి సికందర్‌ రజాపై భారత్‌ అభిమానులు ట్విటర్‌లో ప్రేమ వర్షం కురిపించారు. 

వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే సికందర్‌ రజా తనతో జాగ్రత్తగా ఉండాలని భారత బౌలర్లకు హెచ్చరికలు పంపించాడు. అయితే తొలి రెండు వన్డేల్లో అతన్ని తొందరగా ఔట్‌ చేసి సఫలమైన టీమిండియా బౌలర్లు.. మూడో వన్డేలో మాత్రం​ అతని బ్యాటింగ్‌ పవర్‌ను రుచి చూశారు. పాకిస్తాన్‌ మూలాలున్న ఆటగాడిగా జింబాబ్వే జట్టులో ఆడుతున్న సికందర్‌ రజా తనదైన ముద్ర వేస్తున్నాడు. 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న జట్టును సికందర్‌ రజా నడిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇన్నింగ్స్‌ నిర్మించడమే అనుకుంటే ఏకంగా సెంచరీతో చెలరేగి భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఒక దశలో జింబాబ్వేను విజయం దిశగా నడిపించిన సికిందర్‌ రజా.. భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయకుండా అడ్డుపడేలా కనిపించాడు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించలేక జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఇక సికందర్‌ రజా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ కనబరుస్తున్నాడు. వన్డే క్రికెట్‌లో తనదైన మార్క్‌ చూపిస్తున్న రజాకు గత ఆరు వన్డేల్లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 1986లో పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించిన సికందర్‌ రజా.. 2002లో కుటుంబంతో జింబాబ్వేలో స్థిరపడ్డాడు. 2013 సెప్టెంబర్‌ 3న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సికందర్‌ రజా.. అంతకముందే అంటే 2013 మేలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు సికందర్‌ రజా జింబాబ్వే తరపున 17 టెస్టుల్లో 1187 పరుగులు, 115 వన్డేల్లో 3366 పరుగులు, 50 టి20ల్లో 685 పరుగులు సాధించాడు.

చదవండి: Babar Azam: చిన్న జట్టంటే అంత చులకన.. ఏ దేశంతో ఆడుతున్నారో తెలియదా!

Ind Vs Zim 3rd ODI: సికిందర్‌ రజా సెంచరీ వృథా.. పోరాడి ఓడిన జింబాబ్వే!

మరిన్ని వార్తలు