టీమిండియా ‘టాప్‌’ రికార్డు

6 Dec, 2020 18:00 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను టీమిండియా ఇంకా ఒక మ్యాచ్‌ ఉండగానే కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి టీ20ను గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా అదే పునరావృతం చేసి సిరీస్‌ను సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా సిరీస్‌ను 2-0తో సాధించింది. కాగా, ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 మ్యాచ్‌ల పరంగా చూస్తే అత్యధిక పరుగుల ఛేజింగ్‌లో టీమిండియానే టాప్‌-2 స్థానాలను ఆక్రమించింది. (హార్దిక్‌ బాదుడు.. టీమిండియాదే సిరీస్‌)

2016లో ఆసీస్‌తో జరిగిన టీ20లో టీమిండియా 198 పరుగుల టార్గెటన్‌ను ఛేదించింది. మళ్లీ ఇప్పుడు 195 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియాపై వారి దేశంలోనే ఛేజ్‌ చేసింది. ఫలితంగా ఆసీస్‌పై ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగుల ఛేజింగ్‌ రికార్డుల్లో తొలి రెండు స్థానాల్లో టీమిండియా నిలిచింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు సిడ్నీలో జరగడం మరొక విశేషం. ఇక టీమిండియా తర్వాత స్థానంలో శ్రీలంక ఉంది. 2017లో 174 పరుగుల టార్గెట్‌ను ఆసీస్‌పై వారి దేశంలో ఛేజ్‌ చేశారు లంకేయులు. ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా విజయాలు సాధించిన జాబితాలో పాకిస్తాన్‌తో కలిసి టీమిండియా సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది టీమిండియా వరుసగా సాధించిన టీ20 విజయాలు 9. 2018లో పాకిస్తాన్‌ ఇలా వరుసగా 9 విజయాలు నమోదు చేసింది. తొలి స్థానంలో అఫ్గానిస్తాన్‌ ఉంది. అఫ్గానిస్తాన్‌ 2016-17 సీజన్‌లో వరుసగా 11 విజయాలు సాధించగా, 2018-19 సీజన్‌లో 12 విజయాలు సాధించింది. దాంతో తొలి రెండు స్థానాల్లో అఫ్గానిస్తానే ఉంది. 

మరిన్ని వార్తలు