బాక్సింగ్‌ డే టెస్టు: విజయావకాశాలు మనకే!

28 Dec, 2020 08:49 IST|Sakshi

మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 131 పరుగుల ఆదిక్యం సాధించిన భారత జట్టుకు విజయవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని గత రికార్డులను బట్టి తెలుస్తోంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో 100కు పైగా తొలి ఇన్నింగ్స్‌ ఆదిక్యం సాధించిన జట్లు ఎక్కువ సార్లు గెలుపును సొంతం చేసుకున్నాయి. సెంచరీ పరుగుల కంటే ఎక్కువ తొలి ఇన్నింగ్స్‌ ఆదిక్యంతో గెలిచిన జట్లలో భారత్‌ కూడా ఉండటం విశేషం. 1910లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులు ఆదిక్యం సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంతో ద్వారా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1931లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆదిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసి 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
(చదవండి: రహానే అనూహ్య రనౌట్‌, టీమిండియా ఆలౌట్‌)

1972లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్సింగ్స్‌లో 133 పరుగుల ఆదిక్యం సాధించిన ఆతిథ్య జట్టు ప్రత్యర్థిని రెండో ఇన్సింగ్స్‌లో కట్టడి చేసి.. 92 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. ఇక 1980లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 182 పరుగుల భారీ ఆదిక్యాన్ని సాధించింది. ఆతిథ్య జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసి 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, పైన పేర్కొన్న నాలుగింటిలో మూడింట ఆస్ట్రేలియానే ఉండటం గమనార్హం. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో ఆదిక్యం సాధించి వరుసగా రెండు టెస్టుల్లో టీమిండియా ఎప్పుడూ ఓటమి చెందకపోవడం విశేషం. ఇక తాజా మ్యాచ్‌ విషయానికొస్తే తొలి ఇన్సింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్‌ అయిన ఆసీస్‌.. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 28/1 తో బ్యాటింగ్‌ చేస్తోంది. టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే.
(చదవండి: నాయకుడు నడిపించాడు)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు