‘వారి విలువేమిటో బాగా తెలుసు’.. టీమిండియా టాప్‌–3పై ద్రవిడ్‌ వ్యాఖ్య

8 Jun, 2022 00:51 IST|Sakshi

రేపటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్‌   

సీనియర్లకు విశ్రాంతి తప్పదన్న భారత హెడ్‌ కోచ్‌     

Ind Vs SA T20 Series- న్యూఢిల్లీ: అంతర్జాతీయ టి20ల్లో భారత ప్రధాన ఆటగాళ్ల స్ట్రయిక్‌ రేట్‌పై ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లిలో ఒక్కరు కూడా దూకుడుగా ఆడలేకపోతుండటంతో చివర్లో జట్టుపై ఒత్తిడి పడుతోందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గత ప్రపంచకప్‌ సమయంలో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. అయితే టీమ్‌ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం ఈ ఆరోపణల్లో పస లేదని తేల్చేశాడు.

అన్ని సందర్భాల్లో బ్యాటర్లు విధ్వంసకర రీతిలో ఆడాల్సిన అవసరం లేదని అతను వ్యాఖ్యానించాడు. ‘మా టాప్‌–3 బ్యాటింగ్‌ నైపుణ్యం గురించి మాకు బాగా తెలుసు. వాళ్లు అత్యుత్తమ ఆటగాళ్లు. పరిస్థితులకు తగినట్లుగా ఆడటం అన్నింటికంటే ముఖ్యం. భారీ స్కోర్లకు అవకాశం ఉన్న సమయంలో స్ట్రయిక్‌ రేట్‌ ఎక్కువగా ఉండాలని మేమూ భావిస్తున్నాం.

అయితే వికెట్‌ అనుకూలంగా లేనప్పుడు దానిని బట్టి ఆడాల్సి ఉంటుంది. టి20ల్లో సానుకూల ఆరంభం అవసరం. అయితే మాకు వారి బాధ్యతలపై స్పష్టత ఉంది. వారికీ తాము ఏం చేయాలనే దానిపై స్పష్టతనిస్తాం కాబట్టి సమస్య ఉండదు’ అని ద్రవిడ్‌ వ్యాఖ్యానించాడు. రోహిత్, కోహ్లిల గైర్హాజరులో రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో భిన్నమైన టాప్‌–3 బరిలోకి దిగే అవకాశం ఉంది.

రోహిత్‌లాంటి అన్ని ఫార్మాట్‌ల ఆటగాడిని అన్ని సిరీస్‌లకు అందుబాటులో ఉండాలని కోరడం కూడా సరైందని కాదని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. సీనియర్లకు తగినంత విశ్రాంతి అవసరమని అతను అన్నాడు. ‘రోహిత్‌కు విశ్రాంతినివ్వడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. రాహుల్‌కు గతంలోనూ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అయినా ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌లో రోహిత్‌లాంటి ప్లేయర్లను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ కూడా ఉంది. అలాంటి ప్రధాన మ్యాచ్‌లకు వారంతా ఫిట్‌గా ఉండాలి. సీనియర్లు లేకపోతే కొత్త ఆటగాళ్లను పరీక్షించి మన బలం ఏమిటో అంచనా వేయవచ్చు కూడా. టి20 ప్రపంచకప్‌ వరకు ఈ రొటేషన్‌ పద్ధతి సాగుతూనే ఉంటుంది’ అని హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు.

చదవండి: Sarfaraz Khan: అదరగొట్టిన సర్ఫరాజ్‌.. ట్రిపుల్‌ సెంచరీ, 2 డబుల్‌ సెంచరీలు, 3 సెంచరీలు!
Ind Vs SA 2022: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. పూర్తి షెడ్యూల్‌, జట్ల వివరాలు!

>
మరిన్ని వార్తలు